పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మార్పునకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ‘పశ్చిమ బెంగాల్’ (West Bengal) పేరును ‘పశ్చిమ్ బంగా’ (Paschim Banga)గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై ఇంగ్లీషులోనూ West Bengalకు బదులుగా Paschim Banga పేరునే ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు.

సోమవారం కోల్‌కతాలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 4 నుంచి 14 వరకు జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ ప్రతిపాదనను సభ ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. 1947లో దేశ విభజన సమయంలో బెంగాల్ ఎదుర్కొన్న చారిత్రక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం పేరు మార్పు ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు వివరించారు.

బెంగాలీ భాషలో ఇప్పటికే ‘పశ్చిమ్ బంగా’ పేరు వాడుకలో ఉందని అదే పేరును ఇంగ్లీషులోనూ అధికారికంగా ఉపయోగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు. డిసెంబర్ 9న రాష్ట్ర అసెంబ్లీలో పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన అనంతరం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదంతోనే పేరు మార్పు తక్షణమే అమల్లోకి రాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరు మార్చాలంటే పార్లమెంట్‌లో చట్టపరమైన ప్రక్రియ పూర్తికావాలి. రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *