మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో బలమైన దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మించుకోవడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సముద్ర అనుసంధానం సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని తెలిపారు.

సోమవారం విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా ఫౌండేషన్ భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం సముద్ర రంగంలో ఉన్న ప్రాధాన్యతను వివరించారు.

విశాఖపట్నానికి గొప్ప సముద్ర చరిత్ర ఉందని భారతదేశ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ నగరం ప్రస్తుతం వాణిజ్యం, సాంకేతిక రంగాల్లోనూ కీలక కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఆగ్నేయాసియా దేశాలతో భారతదేశానికి శతాబ్దాల నాటి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆధునిక రవాణా వ్యవస్థలు అందుబాటులోకి రాకముందే ఇరు ప్రాంతాల తీరప్రాంతాల మధ్య వ్యాపారులు పరిశోధకులు రాకపోకలు సాగిస్తూ వస్తువులు, విజ్ఞానం, సంస్కృతిని పరస్పరం పంచుకునేవారని తెలిపారు.

కళింగపట్నం, మచిలీపట్నం వంటి ప్రాచీన నౌకాశ్రయాలు ఈ సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఒకప్పుడు సముద్రమే మన తొలి రహదారి అని వ్యాఖ్యానించారు. నేడు ఆధునిక నౌకాశ్రయాలు, డిజిటల్ సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం ద్వారా ఈ చారిత్రక అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందన్నారు.

ఈ నేపథ్యంలోనే సదస్సుకు ‘కనెక్టివిటీ – కన్వర్జెన్స్ – కోఆపరేషన్’ అనే థీమ్‌ను ఎంపిక చేసినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. సాగరమాల మారిటైమ్ ఇండియా విజన్-2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047 వంటి కార్యక్రమాల ద్వారా నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణం, రవాణా, సరుకు నిర్వహణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.

భారత నౌకా నిర్మాణ సముద్ర రంగాలను బలోపేతం చేసేందుకు దాదాపు రూ.70 వేల కోట్లతో కూడిన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇందులో రూ.25 వేల కోట్ల మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ కూడా ఉందని వివరించారు.

భారతదేశ విదేశీ వాణిజ్యంలో దాదాపు 95 శాతం సరుకు రవాణా సముద్ర మార్గం ద్వారానే జరుగుతోందని మంత్రి గుర్తుచేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి మెరుగైన నౌకాశ్రయాలు నౌకాయాన మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని అన్నారు. ప్రతి కొత్త నౌకాశ్రయం పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని నారా లోకేశ్ పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *