న్యూఢిల్లీ, నవంబర్‌ 23 :

భారత్‌-నేపాల్‌ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు ప్రకటించారు. నేపాల్‌ అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షాతో జరిగిన చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య ఎనిమిది ఒప్పందాలు కుదిరాయి. అలాగే ‘వికసిత్‌ భారత్‌-సమున్నత్‌ నేపాల్‌’ విజన్‌ డాక్యుమెంట్‌పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

ఈ సందర్భంగా అయోధ్య-జనక్‌పూర్‌ మధ్య సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. 669 మెగావాట్ల సామర్థ్యం కలిగిన లోయర్‌ అరుణ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నేపాల్‌లో ఐఐటీ క్యాంపస్‌, స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌, ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చలను కొనసాగించాలని నేతలు అంగీకరించారు. భారత్‌తో నేపాల్‌ సంబంధాలు హిమాలయాలంత దృఢంగా ఉన్నాయని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా పేర్కొన్నారు. తాజా ఒప్పందాలతో ఇరు దేశాల మధ్య అభివృద్ధి, వాణిజ్యం, విద్యుత్‌, విద్యా రంగాల్లో సహకారం మరింత విస్తరించనుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *