
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తిరిగి పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించిన ఎస్పీ.. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు ఇరు పార్టీల నేతలు ఢిల్లీలో తొలి అధికారిక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో సీట్ల కేటాయింపు, ఎన్నికల వ్యూహాలు, కూటమి కార్యాచరణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకాలపై కీలక చర్చకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఇరు పార్టీల నేతలు తొలి అధికారిక సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో రెండు రోజుల పాటు ఈ చర్చలు జరగనున్నాయి. ఇరు పార్టీల నుంచి నలుగురు చొప్పున కీలక నాయకులు పాల్గొని సీట్ల కేటాయింపు, ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.
కాంగ్రెస్ తరఫున యూపీ ఇన్ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్, పీసీసీ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్, శాసనసభా పక్ష నేత వీరేంద్ర చౌదరి హాజరుకానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్, యూపీ అధ్యక్షుడు శ్యామ్‌లాల్ పాల్, ఎంపీలు రాజీవ్ రాయ్, ఇక్ర హసన్ చర్చల్లో పాల్గొననున్నారు.
అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా హాజరుకావడం లేదు. ఆమె ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, తెరవెనుక నుంచి సీట్ల సర్దుబాటు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ ప్రతిపాదనకు ఎస్పీ అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం కూటమి భవిష్యత్తుకు కీలకం కానుంది.
ప్రస్తుతం ఢిల్లీలో జరగనున్న సమావేశంలో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాలపైనే చర్చ జరగనుంది. ఆయా స్థానాల్లో గెలుపు అవకాశాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, తమ వద్ద ఉన్న గణాంకాలు, ఎన్నికల వ్యూహాలను కాంగ్రెస్ నేతలు ఎస్పీ నాయకులకు వివరించనున్నారు. ఈ ప్రతిపాదనలపై సమాజ్‌వాదీ పార్టీ అంతర్గతంగా చర్చించిన తర్వాత, ఏకాభిప్రాయం కుదిరిన అంశాలను తదుపరి సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
100కు పైగా స్థానాలపై కాంగ్రెస్ గురి
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కూటమిలో భాగంగా 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కూటమి సమీకరణాల పరంగా తమకు అనుకూలంగా ఉన్న 55 నుంచి 60 ఏ-గ్రేడ్ నియోజకవర్గాలను కోరాలని భావిస్తోంది. మరోవైపు బీజేపీ బలంగా ఉన్న 40 నుంచి 45 స్థానాలను ఎస్పీ తమకు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. మొత్తంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్న సుమారు 60 స్థానాలను దక్కించుకోవడంపై హస్తం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, స్వల్ప ఓట్ల తేడాతో వెనుకబడిన స్థానాలను కూడా కాంగ్రెస్ గుర్తిస్తోంది. అంతేకాకుండా తమ సంప్రదాయ దళిత, ముస్లిం, బ్రాహ్మణ ఓటు బ్యాంకు సమీకరణాలకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల కోసం పట్టుబట్టాలని యోచిస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు 105 స్థానాలను కేటాయించింది. దీంతో ఈసారి కూడా అదే స్థాయిలో సీట్లు కోరాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 స్థానాలకు గాను కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేసింది. ఈ ఎన్నికల ఫార్ములాను పరిగణనలోకి తీసుకున్నా కనీసం 85కు పైగా అసెంబ్లీ స్థానాలు తమకు దక్కాలని కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీట్ల కేటాయింపుపై ఎస్పీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
సీట్ల సంఖ్య కంటే ఎన్నికల్లో గెలుపు అవకాశాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికలు ఎస్పీకి అత్యంత కీలకంగా మారడంతో ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ స్థిరమైన ఓటు బ్యాంకు లేదని, గత ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం రెండు స్థానాలు, రెండు శాతం ఓట్లకే పరిమితమైందని ఎస్పీకి చెందిన ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టకుండా.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన, బలమైన స్థానిక నాయకత్వం ఉన్న నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఎస్పీ భావిస్తోంది. ఇందులో భాగంగా సుమారు 55 స్థానాలతో కూడిన జాబితాను కాంగ్రెస్‌కు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ప్రతిష్టంభనకు కారణమవుతున్న నియోజకవర్గాలు
సీట్ల పంపకాల చర్చల్లో కొన్ని నియోజకవర్గాలు ఇరు పార్టీల మధ్య సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎస్పీ గెలుచుకున్న సహరాన్పూర్ దేహత్, బెహత్, అమేథీ, రాయ్‌బరేలీ వంటి స్థానాల విషయంలో ఏకాభిప్రాయం ఎలా కుదురుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సహరాన్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ ఆ ప్రాంతంలోని రెండు స్థానాల కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలు గాంధీ కుటుంబ రాజకీయ ప్రతిష్ఠతో ముడిపడి ఉండటంతో కాంగ్రెస్ వాటిని కీలకంగా భావిస్తోంది. ఎస్పీకి కాంగ్రెస్ అందించిన 181 నియోజకవర్గాల జాబితాలో ఈ రెండు జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అఖిలేశ్–రాహుల్ చర్చలపై ఆశలు
మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య సత్సంబంధాలు ఉండటం కూటమి చర్చలకు సానుకూల అంశంగా కనిపిస్తోంది. వీరిద్దరూ నవంబర్ 16న ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం నెలకొన్న సీట్ల పంపకాల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఇరు పార్టీల వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అవసరమైతే కొన్ని నియోజకవర్గాల్లో ఎస్పీ నాయకులనే కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దించడం కూడా ఒక రాజీ మార్గంగా పరిశీలించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది



