
గాంధీ, నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో శస్త్రచికిత్సల కోసం రోగులు నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో అందుబాటులో ఉన్న 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సల కోసం నిరీక్షిస్తున్న రోగులకు టిమ్స్‌లో ఆపరేషన్లు నిర్వహించనున్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న సర్జరీల వెయిటింగ్ లిస్ట్‌ను తగ్గించడంతో పాటు రోగులకు త్వరితగతిన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో వైద్య సేవలపై ఒత్తిడి అధికమవుతోంది. ముఖ్యంగా గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లోని కీలక విభాగాలకు వచ్చే రోగులు శస్త్రచికిత్సల కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువ ఖర్చుతో వైద్యం అందుబాటులో ఉండటంతో పాటు.. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి వంటి పథకాల ద్వారా చికిత్స పొందే అవకాశం ఉండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు.
అయితే పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆపరేషన్ థియేటర్లు, ఇతర వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో శస్త్రచికిత్సలు ఆలస్యమవుతున్నాయి. దీంతో సర్జరీల కోసం ఎదురుచూసే రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
నిమ్స్ ఆసుపత్రిలో న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్ తదితర కీలక విభాగాలకు రోగుల తాకిడి అధికంగా ఉంది. ముఖ్యంగా న్యూరోసర్జరీ విభాగంలో అత్యవసరం కాని కొన్ని ఆపరేషన్ల కోసం రెండు నుంచి మూడు నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో 12కు పైగా ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అవి సరిపోవడం లేదు. గాంధీ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆపరేషన్ థియేటర్ల కొరత కారణంగా వైద్యులు రొటేషన్ పద్ధతిలో వాటిని వినియోగించుకుంటున్నారు. దీంతో సాధారణంగా వారం, పది రోజుల్లో పూర్తికావాల్సిన కొన్ని శస్త్రచికిత్సలు కూడా ఆలస్యమవుతున్నాయి.
మరోవైపు ఉస్మానియా ఆసుపత్రిలో పాత భవనాన్ని మూసివేయడంతో స్థలాభావ సమస్య మరింత తీవ్రమైంది. ఫలితంగా అక్కడి వైద్య సేవలపైనా ఒత్తిడి పెరిగింది. గాంధీ, నిమ్స్ ఆసుపత్రులకు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. అయితే శస్త్రచికిత్సల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో కొందరు రోగులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఈ పరిస్థితిని చక్కదిద్ది రోగులకు సకాలంలో శస్త్రచికిత్సలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను వినియోగించుకునేలా చర్యలు చేపడుతోంది. ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇప్పటికే ప్రకటన కూడా చేశారు.
సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రిలో సుమారు 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు శస్త్రచికిత్సలకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ థియేటర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తొలుత వైరస్, బ్యాక్టీరియా రహితంగా ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టి, ఆపరేషన్లకు అనువుగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆపరేషన్ థియేటర్లను వినియోగంలోకి తీసుకొచ్చారు.
ఇక నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్న రోగులను టిమ్స్‌కు తరలించి అక్కడే ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లను కేటాయించడంతో పాటు, అవసరమైన వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలను సమకూర్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం టిమ్స్‌లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత ఉండటంతో తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కొత్త నియామకాలు పూర్తయ్యే వరకు నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందినే టిమ్స్‌లోనూ సేవలందించేలా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో సాధారణ విధులు నిర్వహిస్తూనే టిమ్స్‌లో శస్త్రచికిత్సలు చేసేలా పని విభజన చేపట్టనున్నారు.
ఈ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల్లో సర్జరీల కోసం ఎదురుచూస్తున్న రోగులకు త్వరగా వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా నెలల తరబడి ఆపరేషన్ల కోసం నిరీక్షిస్తున్న రోగులకు ఈ నిర్ణయం కొంత ఉపశమనం కలిగించనుంది.



