
విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సన్ వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను సాధించి ప్రపంచ చెస్‌లో సంచలనం సృష్టించాడు భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్. కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. అయితే ఇప్పుడు అతడి ముందున్న సవాలు మరింత కఠినంగా మారింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న గుకేశ్‌కు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జవోఖిర్ సిందరోవ్ గట్టి పోటీ ఇవ్వనున్నాడు. ఈ పోరులో సిందరోవ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాగ్నస్ కార్ల్‌సన్ సహా పలువురు ప్రముఖులు అంచనా వేస్తున్నారు. మరి అంచనాలను తలకిందులు చేసి గుకేశ్ మరోసారి ప్రపంచ విజేతగా నిలుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.
గుకేశ్‌కు ఫామ్ సమస్య.. సిందరోవ్ జోరు
ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ తన కెరీర్‌లో మరో కీలక పరీక్షకు సిద్ధమయ్యాడు. మంగళవారం స్విట్జర్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఛాలెంజర్ జవోఖిర్ సిందరోవ్‌తో తలపడనున్నాడు. తొలి గేమ్‌లో గుకేశ్ నల్ల పావులతో ఆడనున్నాడు.
2024 డిసెంబరులో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి 18 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన గుకేశ్.. ఈసారి టైటిల్ పోరులో ఫేవరెట్‌గా ఉండాల్సింది. కానీ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మరోవైపు సిందరోవ్ ఇటీవల వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ పోరులో అతడికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెస్ విశ్లేషకులు భావిస్తున్నారు.
గుకేశ్ రేటింగ్‌లో భారీ పతనం
గత ఏడాది టాటా స్టీల్ చెస్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన గుకేశ్.. నార్వే చెస్ టోర్నీలో మూడో స్థానాన్ని సాధించాడు. అయితే 2025 చివరి నుంచి అతడి ఆటలో నిలకడ తగ్గింది. ఫిడే ప్రపంచకప్‌లో త్వరగానే నిష్క్రమించడంతో పాటు ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
ఈ ఏడాది కూడా అతడి పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. టాటా స్టీల్ చెస్‌లో ఉమ్మడి ఎనిమిదో స్థానం, ప్రేగ్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్‌లో తొమ్మిదో స్థానం సాధించాడు. నార్వే చెస్‌లోనూ అట్టడుగు స్థానంతో నిరాశపరిచాడు. దీంతో అతడి క్లాసికల్ రేటింగ్ సుమారు 70 పాయింట్లు తగ్గి 2710కి చేరింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సమయంలో మూడో ర్యాంకులో ఉన్న గుకేశ్.. ప్రస్తుతం 26వ స్థానానికి పడిపోయాడు.
సిందరోవ్‌కు విజయాల జోరు
మరోవైపు ఈ ఏడాది క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జవోఖిర్ సిందరోవ్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌ను సవాలు చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అంతేకాకుండా 2025 ఫిడే ప్రపంచకప్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం 2782 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న సిందరోవ్‌ను ఓడించి టైటిల్ నిలబెట్టుకోవాలంటే గుకేశ్ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఛాంపియన్‌షిప్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 14 క్లాసికల్ గేమ్‌లు నిర్వహిస్తారు. ప్రతి గేమ్‌లో గెలిచిన ఆటగాడికి ఒక పాయింట్, డ్రా అయితే ఇద్దరికీ చెరో అర పాయింట్ లభిస్తుంది. ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తాడు. 14 గేమ్‌లు ముగిసిన తర్వాత ఇద్దరి స్కోర్లు సమానంగా ఉంటే విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ నిర్వహిస్తారు.
విజేతకు భారీ నగదు బహుమతి
ఈ ఛాంపియన్‌షిప్ కోసం మొత్తం రూ.23 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటించారు. మ్యాచ్ ఫలితాన్ని బట్టి బహుమతి మొత్తాన్ని విభజిస్తారు. ఒక్కో గేమ్‌లో సాధించే విజయానికి సుమారు రూ.1.8 కోట్లు కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని ఇద్దరు ఆటగాళ్లకు సమానంగా పంచుతారు. టైబ్రేక్‌లో విజేతను నిర్ణయించినా లేదా 14 గేమ్‌ల అనంతరం విజేత 7.5-6.5 స్కోరుతో నిలిచినా.. విజేతకు రూ.12 కోట్లు, రన్నరప్‌కు రూ.11 కోట్లు అందుతాయి.
ఆసక్తికర గణాంకాలు
- 18 ఏళ్లు: ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినప్పుడు గుకేశ్ వయసు. 18 ఏళ్ల 6 నెలల వయసులో ఈ ఘనత సాధించి అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించాడు.
- 20 ఏళ్లు: ఈ పోరులో పాల్గొంటున్న గుకేశ్, సిందరోవ్ ఇద్దరి వయసు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఇంత తక్కువ వయసున్న ఆటగాళ్ల మధ్య జరుగుతున్న పోటీగా ఇది నిలవనుంది.
- 3 క్లాసికల్ గేమ్‌లు: గతంలో వీరిద్దరూ మూడు క్లాసికల్ గేమ్‌లలో తలపడ్డారు. ఇందులో సిందరోవ్ రెండింటిలో విజయం సాధించగా.. మరో గేమ్ డ్రాగా ముగిసింది.
గత రికార్డులు, ప్రస్తుత ఫామ్ సిందరోవ్‌కు అనుకూలంగా కనిపిస్తున్నా.. ప్రపంచ ఛాంపియన్‌గా తన సత్తా నిరూపించుకోవాల్సిన బాధ్యత గుకేశ్‌పై ఉంది.




