ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 మినీ వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 16న గోవాలో ఈ వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 1,220 మంది క్రికెటర్లు వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఫ్రాంచైజీల వద్ద అందుబాటులో ఉన్న 66 స్థానాల కోసం వీరంతా పోటీపడనున్నారు. వీటిలో 25 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు.

1,220 మంది ఆటగాళ్లలో 939 మంది భారతీయులే

వేలం కోసం రిజిస్టర్ చేసుకున్న 1,220 మందిలో 939 మంది భారత క్రికెటర్లు కాగా, 281 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. భారత ఆటగాళ్లలో 14 మంది క్యాప్డ్ క్రికెటర్లు ఉండగా.. విదేశీ ఆటగాళ్లలో ఈ సంఖ్య 170గా ఉంది. అసోసియేట్ దేశాల నుంచి 42 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.

అన్‌క్యాప్డ్ విభాగంలో గతంలో ఐపీఎల్ ఆడిన భారత ఆటగాళ్లు 127 మంది ఉండగా.. తొలిసారి వేలం బరిలోకి దిగుతున్న భారత క్రికెటర్లు 798 మంది ఉన్నారు. అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్ల సంఖ్య 69గా నమోదైంది.

రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌లో ఇద్దరే భారతీయులు

ఈ వేలంలో అత్యధిక కనీస ధర అయిన రూ.2 కోట్ల విభాగంలో మొత్తం 29 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో భారతదేశం నుంచి పేసర్లు అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ మాత్రమే చోటు దక్కించుకున్నారు.

విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్లర్క్, జై రిచర్డ్సన్, మహలీ బియర్డ్‌మన్, స్పెన్సర్ జాన్సన్ ఉన్నారు. ఇంగ్లాండ్ తరఫున బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, సోనీ బేకర్, టామ్ కరన్ ఈ జాబితాలో చోటు సంపాదించారు.

న్యూజిలాండ్ నుంచి ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ట్రెంట్ బౌల్ట్, విలియం ఓరూర్క్ ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఫజల్‌హక్ ఫారూఖీ, ముజీబ్ ఉర్ రెహమాన్, రహ్మానుల్లా గుర్బాజ్ పేర్లు నమోదయ్యాయి.

దక్షిణాఫ్రికా నుంచి అన్రిచ్ నోర్జే, గెరాల్డ్ కోయెట్జీ, శ్రీలంక నుంచి మతీషా పతిరానా, వనిందు హసరంగా.. వెస్టిండీస్ నుంచి షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మెయర్ కూడా రూ.2 కోట్ల బేస్ ప్రైస్ జాబితాలో ఉన్నారు.

రూ.కోటి, రూ.75 లక్షల బేస్ ప్రైస్ జాబితా

రూ.కోటి కనీస ధర విభాగంలో భారత పేసర్లు ఆకాశ్ దీప్, జయదేవ్ ఉనద్కత్, తుషార్ దేశ్‌పాండే, ఉమేశ్ యాదవ్ తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

ఇక రూ.75 లక్షల బేస్ ప్రైస్ జాబితాలో దీపక్ హుడా, కరుణ్ నాయర్, కుల్దీప్ సేన్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, సారాంశ్ జైన్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన 11 మంది ఆటగాళ్లు కూడా వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో హసన్ మహ్మద్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, రిపన్ మొండల్, రిషాద్ హసన్, సైఫ్ హసన్, షేక్ మహేదీ హసన్, షమీమ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, తంజీమ్ హసన్ సాకిబ్, తౌహిద్ హృదయ్, ఎండీ రుబెల్ ఉన్నారు. వీరికి సంబంధించిన బేస్ ప్రైస్ వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

తుది జాబితాను సిద్ధం చేస్తున్న బీసీసీఐ

ప్రస్తుతం 1,220 మంది ఆటగాళ్లతో ఉన్న ప్రాథమిక జాబితాను ఫ్రాంచైజీల అవసరాలకు అనుగుణంగా బీసీసీఐ కుదించనుంది. డిసెంబర్ 1లోపు ఆయా జట్లు తమకు ఆసక్తి ఉన్న ఆటగాళ్ల షార్ట్‌లిస్ట్‌ను బీసీసీఐకి అందించాలి. అనంతరం వేలానికి వారం రోజుల ముందు తుది జాబితాను ప్రకటించనున్నారు.

బెన్ స్టోక్స్, డేవిడ్ వార్నర్, ట్రెంట్ బౌల్ట్, మతీషా పతిరానా వంటి ప్రముఖ ఆటగాళ్లు రూ.2 కోట్ల బేస్ ప్రైస్ విభాగంలో ఉండటంతో ఈ వేలంపై ఆసక్తి నెలకొంది. ఫ్రాంచైజీలు ఎవరిని దక్కించుకుంటాయి? ఏ ఆటగాళ్లపై భారీ ధరలు వెచ్చిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *