గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందాలంటే పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి పార్టీలన్నీ ఐక్యంగా ముందుకు సాగడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించామని ఆమె పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఐక్యత స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం కొనసాగుతోందని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ప్రశాంతి రెడ్డి అన్నారు. అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

వైసీపీ పాలనలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం వల్ల ఎంతోమంది రాజకీయాలకు దూరమయ్యారని ఆమె ఆరోపించారు. బీసీలకు 34 శాతమే కాకుండా 40 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. బీసీలకు అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం అని అన్నారు. మేయర్, చైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించడంతో పాటు విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే నాయకత్వం చంద్రబాబుదని ప్రశంసించారు.

ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ తన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రామ స్థాయి నుంచి ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలకు నామినేషన్లు వేసే అవకాశం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కూటమి పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని అన్నారు.

2024 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా గెలిచారంటూ విమర్శలు చేస్తున్న వారికి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా వచ్చిన ఫలితాలే సమాధానమని ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *