తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద తిరుమలలో సహజంగా మరణించిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా పరిహారాన్ని టీటీడీ అందిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఏడుగురు మృతుల కుటుంబ సభ్యులకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పరిహారం చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా తిరుమలకు వచ్చే భక్తులకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకం ద్వారా బీమా భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చి సహజ మరణం పొందిన ఏడుగురి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో, ఎండీ ఆర్. దొరైస్వామి పాల్గొన్నారు.

ఈ పథకం ప్రకారం తిరుమలకు వచ్చిన భక్తులు సహజంగా మరణిస్తే వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం అందిస్తామని ఈవో వివరించారు. గత రెండు నెలల్లో తిరుమలలో మొత్తం 17 మంది భక్తులు మరణించగా, వారిలో ఏడుగురి కుటుంబాలకు ఇప్పటికే బీమా పరిహారం అందించామని, మిగిలిన వారికి కూడా త్వరలో పరిహారం అందజేస్తామని తెలిపారు.

కష్టకాలంలో ఆర్థికంగా అండగా నిలిచిన టీటీడీకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *