కాకినాడ జిల్లా ఏటిమొగ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో బోటు ఇంజిన్ వైఫల్యంతో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఉప్పాడ-తుని తీరంలోని కృష్ణాపురం సమీపంలో తీరం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో బోటు నిలిచిపోయిందని తెలిపారు. సమాచారం అందిన వెంటనే కోస్ట్‌గార్డ్, నౌకాదళ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.

తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన అధికారుల పనితీరును మంత్రి అభినందించారు. సముద్రంలో నీటి లోతు తక్కువగా ఉండటంతో మరో బోటు సాయంతో మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని ఏడుగురినీ క్షేమంగా తీరానికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు.

మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారుల గల్లంతు వ్యవహారంపైనా మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. వారి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మత్స్యకారుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాసినట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశామని చెప్పారు. గల్లంతైన మత్స్యకారుల బోటు ఆచూకీ కోసం బంగ్లాదేశ్, మయన్మార్ సముద్ర జలాల్లోనూ అన్వేషణ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ఆయా దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కోస్ట్‌గార్డ్, భారత నౌకాదళం ఒడిశా అధికారుల సమన్వయంతో యుద్ధప్రాతిపదికన గాలింపు కొనసాగుతోందని వివరించారు. మత్స్యకారుల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గల్లంతైన ఏడుగురినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *