ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. పరిశీలన అనంతరం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లోని 46 రెవెన్యూ డివిజన్లు, 214 మండలాల పరిధిలో మూడో విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.

మూడో విడతలో మొత్తం 4,244 సర్పంచ్ స్థానాలు, 42,712 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల పరిశీలన అనంతరం సర్పంచ్ పదవులకు సంబంధించి 22,309 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్లు అధికారులు వెల్లడించారు. వార్డు సభ్యుల స్థానాలకు 99,220 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందినట్లు తెలిపారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే సర్పంచ్ స్థానాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో 325 సర్పంచ్ స్థానాలకు గాను 1,588 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. నెల్లూరు జిల్లాలో 267 స్థానాలకు 1,462 నామినేషన్లు, విజయనగరం జిల్లాలో 244 స్థానాలకు 1,330 నామినేషన్లు ఆమోదం పొందాయి.

వార్డు సభ్యుల నామినేషన్లలో నెల్లూరు జిల్లా అత్యధిక సంఖ్యతో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 7,467 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. విజయనగరం జిల్లాలో 7,267, అనకాపల్లి జిల్లాలో 6,427 నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు. నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో మూడో విడత పంచాయతీ ఎన్నికల తదుపరి ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *