
అమరావతి: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులతో కూడిన బోటు గల్లంతు కావడంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 11న సముద్రంలో వేటకు వెళ్లారు. ఈ నెల 14వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన వారు.. ఆ తర్వాత నుంచి అందుబాటులోకి రాలేదు. దీంతో గత 13 రోజులుగా వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మత్స్యకారుల బోటు గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వివరాలు తెలుసుకున్నారు. తుపాను ప్రభావంతో బోటు సముద్ర ప్రవాహాలకు కొట్టుకుపోయి ఇతర దేశాల జలాల్లోకి వెళ్లి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా మయన్మార్ లేదా బంగ్లాదేశ్ వైపు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గల్లంతైన మత్స్యకారులకు సంబంధించిన సమాచారాన్ని మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు పంపించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారులను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
మరోవైపు గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్టల్ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో సముద్రంలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.




