టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన సాఫ్ట్‌వేర్‌లు, ఆన్‌లైన్ సేవల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వేగంగా గుర్తించి పరిష్కరించేందుకు అంతర్గతంగా ‘కోడ్ రెడ్’ (Code Red) ప్రకటించింది. ఇటీవల దాదాపు 24 గంటలపాటు పలు సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు తలెత్తకుండా వ్యవస్థలను మెరుగుపరిచే దిశగా సంస్థ చర్యలు ప్రారంభించింది.

అవుట్‌లుక్, టీమ్స్, కోపైలట్ సేవల్లో అంతరాయం

ఈ నెల 12, 13 తేదీల్లో మైక్రోసాఫ్ట్‌కు చెందిన అవుట్‌లుక్, టీమ్స్, కోపైలట్ వంటి సేవల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. జులైలో ప్రవేశపెట్టిన ఓ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపమే ఇందుకు కారణమని సంస్థ గుర్తించింది. అయితే ఈ సమస్య దాదాపు నాలుగు నెలలపాటు గుర్తించబడకపోవడం గమనార్హం. ఈ ఘటన వెనుక హ్యాకింగ్ లేదా ఏఐ ఏజెంట్ల దాడి లేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.

99.9 శాతం సేవల హామీ.. 24 గంటలపాటు నిలిచిన సర్వీసులు

మైక్రోసాఫ్ట్ సాధారణంగా తన 365 సేవలు 99.9 శాతం సమయం అందుబాటులో ఉంటాయని హామీ ఇస్తుంది. అంటే నెలకు సగటున సుమారు 44 నిమిషాల డౌన్‌టైమ్ మాత్రమే ఉండాలి. కానీ ఇటీవల చోటుచేసుకున్న అంతరాయం కారణంగా దాదాపు 24 గంటలపాటు సేవలు ప్రభావితమయ్యాయి. ఇది సాధారణంగా ఉండే డౌన్‌టైమ్‌తో పోలిస్తే చాలా ఎక్కువ.

సమస్యను పరిష్కరించే క్రమంలో స్పందించిన సిబ్బంది 11 బృందాల మధ్య సుమారు 11 వేల సందేశాలను మార్పిడి చేసుకున్నారు. అయినప్పటికీ వారికి అవసరమైన సమాచారం సకాలంలో అందలేదని గుర్తించారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లోని వినియోగదారులు ఈ అంతరాయం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలకు చేరడానికి ఎక్కువ సమయం పడుతున్న అంశం కూడా బయటపడింది.

గంటలోపే సమస్య పరిష్కారమే లక్ష్యం

ఈ పరిణామాల నేపథ్యంలో సాంకేతిక సమస్యలను వీలైనంత త్వరగా, గంటలోపే పరిష్కరించేలా మైక్రోసాఫ్ట్ కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ‘సిల్వర్ మెమో’ పంపించింది. తాజాగా ప్రకటించిన కోడ్ రెడ్‌లో ఐదు రకాల కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించింది. సాఫ్ట్‌వేర్ లోపాలను ముందుగానే గుర్తించడం, సమస్యలపై వేగంగా స్పందించడం, ప్యాచ్‌ల పంపిణీని మెరుగుపరచడం వంటి అంశాలపై సంస్థ దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఆధారపడే సేవల విశ్వసనీయతను పెంచడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *