నర్సాపురం, గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) నాసర్ రెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపు కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక గదులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తుతో పటిష్ట భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

62,921 మంది ఓటర్లు.. 26 గ్రామాల్లో ఎన్నికలు

నర్సాపురం మండలంలో మొత్తం 62,921 మంది ఓటర్లు ఉన్నారని నాసర్ రెడ్డి తెలిపారు. మండలంలోని 26 గ్రామాలు, 185 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బందితో పాటు ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, ఓటర్లు అధికారులకు సహకరించాలని కోరారు. గత రెండు నెలలుగా పంచాయతీ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నామని, గురువారంతో ఈ ప్రక్రియ ముగియనుందని తెలిపారు. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, పంచాయతీ ఎన్నికలను కూడా అదే విధంగా సమర్థవంతంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *