
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. సంస్థలో 11 ఏళ్లకు పైగా పనిచేసిన గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం అధికారికంగా వెల్లడించింది. అయితే ఆయన రాజీనామాకు గల కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. ప్రస్తుతం గ్రూప్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న బాలాజీ త్యాగరాజన్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
2017లో సీఈఓగా బాధ్యతలు
ఫ్లిప్‌కార్ట్‌ను సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి స్థాపించారు. అనంతరం వారు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 2017లో కల్యాణ్ కృష్ణమూర్తి సీఈఓగా నియమితులయ్యారు. 2018లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అమెజాన్, మీషో వంటి ప్రత్యర్థి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురైనా ఫ్లిప్‌కార్ట్ తన మార్కెట్ స్థానాన్ని నిలబెట్టుకునేలా కృషి చేశారు.
కొత్త వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి
కల్యాణ్ నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు పలు ప్రయత్నాలు చేసింది. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించడంతో పాటు.. బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ సేవలను ప్రారంభించింది. తద్వారా ఈ-కామర్స్‌తో పాటు వేగవంతమైన డెలివరీ విభాగంలోనూ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఐపీఓ ఆలస్యం.. అంతర్గత విభేదాలే కారణమా?
కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా వెనుక అసలు కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. అయితే సంస్థలోని అంతర్గత పరిణామాలు, ప్రతిపాదిత ఐపీఓ ఆలస్యం, మాతృసంస్థ వాల్‌మార్ట్‌తో అభిప్రాయ భేదాలు దీనికి కారణమై ఉండవచ్చని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫ్లిప్‌కార్ట్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే అంశంపై వాల్‌మార్ట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఐపీఓ ప్రక్రియ ముందుకు సాగడం లేదని సమాచారం.
దీంతో తమ వద్ద ఉన్న కంపెనీ షేర్లను నగదుగా మార్చుకునే అవకాశం ఆలస్యమవుతోందని కొందరు ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత ఏడాది కాలంలో పలువురు వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ స్థాయి అధికారులు సంస్థను వీడారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు కల్యాణ్ కృష్ణమూర్తి కూడా రాజీనామా చేయడం ఫ్లిప్‌కార్ట్‌లో చర్చనీయాంశంగా మారింది. కొత్త నాయకత్వంలో సంస్థ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో చూడాలి.




