తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు ఈ వివాదం వెనుక కారణాలేంటి? దీని చరిత్ర ఏమిటి? అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు. దీని మూలాలు బ్రిటిష్ పాలన కాలం నుంచే ఉన్నట్లు తెలుస్తోంది. 1862లోనే తొలిసారిగా ఈ ప్రాంతంలో కార్తీక దీపం వెలిగించేందుకు ప్రయత్నం జరిగినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని మద్రాసు హైకోర్టు కూడా తన తీర్పులో ప్రస్తావించడం గమనార్హం.

మదురై సమీపంలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపాన్ని ఎక్కడ వెలిగించాలనే అంశం చాలా కాలంగా వివాదానికి కారణమవుతోంది. సికిందర్ దర్గాకు సమీపంలో ఇటీవల గుర్తించిన పురాతన రాతి స్తంభం వద్ద దీపం వెలిగించాలా? లేక ఉచ్చిపిళ్లైయార్ ఆలయం సమీపంలోని సంప్రదాయ దీప మండపంలోనే వెలిగించాలా? అన్నదే ప్రధాన వివాదంగా మారింది.

మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎప్పటిలాగే ఉచ్చిపిళ్లైయార్ ఆలయ శిఖరంపై ఉన్న సంప్రదాయ దీప మండపంలో మహా దీపాన్ని వెలిగించారు. అయితే, సికిందర్ దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న ‘దీపతూణ్’ వద్ద దీపం వెలిగించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ పరిణామం మరోసారి వివాదానికి దారితీసింది.

నవంబర్ 24న దీపతూణ్ వద్ద ఒక్కసారి సంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించేందుకు సుప్రీంకోర్టు గతవారం అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ అక్కడ దీపం వెలిగించకపోవడంతో వివాదం మరింత ముదిరింది. కొండపై భూమి యాజమాన్య హక్కులు, పూజా సంప్రదాయాల విషయంలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఏ పక్షమూ తమకు అనుకూలంగా ఉపయోగించుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం గమనార్హం.

‘‘తిరుప్పరంకుండ్రం కొండపై ప్రధాన శిఖరంలోని ఉచ్చిపిళ్లైయార్ ఆలయ సమీపంలో ఉన్న సంప్రదాయ దీప మండపంలోనే కార్తీక మహాదీపాన్ని వెలిగించాం’’ అని తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. మరోవైపు, తిరుప్పరంకుండ్రం కొండపైభాగం మొత్తం తమకే చెందుతుందని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతించాలన్న హిందూ సంస్థల డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాయి.

మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం 2025 డిసెంబర్ 1న వెలువరించిన తీర్పుతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఉచ్చిపిళ్లైయార్ ఆలయం సమీపంలోని సంప్రదాయ ప్రదేశంతోపాటు, కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద కూడా కార్తీక దీపం వెలిగించాలని కోర్టు ఆదేశించింది. దర్గా ఉన్న ప్రాంతం, అక్కడికి వెళ్లే మెట్లు, నెల్లితోప్ ప్రాంతాలను మినహాయించి మిగిలిన కొండ ప్రాంతమంతా ఆలయానికి చెందుతుందని స్పష్టం చేసింది. అనంతరం 2026 జనవరిలో ద్విసభ్య ధర్మాసనం కూడా గతంలో ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది.

అయితే, అప్పట్లో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే కారణంతో కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. అంతేకాకుండా, వివాదాస్పద రాతి స్తంభం కేవలం సర్వే రాయి మాత్రమేనని, గతంలో అక్కడ దీపాలు వెలిగించినట్లు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని వాదించింది. ఆగమ శాస్త్ర, ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారమే దీపం వెలిగించే ప్రదేశాన్ని నిర్ణయించాలని, ఇలాంటి అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని కూడా పేర్కొంది.

1862, 1912లోనూ దీపం వెలిగించే ప్రయత్నాలు

మద్రాస్ హైకోర్టు తన తీర్పులో 1862, 1912 సంవత్సరాల్లోనూ తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ప్రస్తావించింది. అయితే, అక్కడ దీపం వెలిగించేందుకు స్థిరమైన సంప్రదాయం లేదని, దీనివల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన అప్పటి అధికారులు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు.

1923 నాటి కోర్టు తీర్పులో కీలక అంశాలు

1923లో సబ్‌కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. దర్గా స్థలం, నెల్లితోప్ ప్రాంతం, మసీదుకు వెళ్లే మెట్ల మార్గం మినహా కొండపై మిగిలిన ప్రాంతంపై ఆలయానికి యాజమాన్య హక్కులు ఉన్నట్లు గుర్తించారు. అయితే, మూడేళ్ల తర్వాత మద్రాస్ హైకోర్టు ఈ తీర్పును రద్దు చేసింది. అనంతరం ఆలయ వర్గాలు దాఖలు చేసిన అప్పీల్‌పై లండన్‌లోని ప్రివీ కౌన్సిల్ జ్యుడీషియల్ కమిటీ జోక్యం చేసుకుని 1923 నాటి డిక్రీని పునరుద్ధరించింది. కొండపై ఆలయ యాజమాన్య హక్కులను సమర్థిస్తూనే, దర్గా స్థలం, అక్కడికి వెళ్లే మెట్ల మార్గానికి కూడా రక్షణ కల్పించింది.

తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో 1996లోనూ ఇలాంటి వివాదమే తలెత్తింది. భవిష్యత్తులో దేవదాయ శాఖ అధికారుల ముందస్తు అనుమతి తీసుకుని కొండపై ప్రత్యామ్నాయ ప్రదేశంలో దీపం వెలిగించే అంశాన్ని దేవస్థానం పరిశీలించవచ్చని అప్పట్లో మద్రాస్ హైకోర్టు అనుమతించింది. అయితే, గతంలో సివిల్ కోర్టు తీర్పు ప్రకారం ముస్లిం వర్గాలకు చెందినవిగా గుర్తించిన ప్రాంతాలతోపాటు దర్గా, దానికి వెళ్లే మెట్లు, నెల్లితోప్ ప్రాంతాలకు కనీసం 15 మీటర్ల దూరంలోనే ప్రత్యామ్నాయ ప్రదేశం ఉండాలని స్పష్టం చేసింది.

ఆలయ యాజమాన్య హక్కులపై దేవాదాయ శాఖ వాదన

మరోవైపు, అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని, తిరుప్పరంకుండ్రం కొండను పురావస్తు శాఖకు అప్పగించాలని, అక్కడ సంప్రదాయ కార్తీక దీపాన్ని నిరంతరం వెలిగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తమిళనాడు దేవాదాయ శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి, పిటిషన్‌లోని అభ్యర్థనలను తోసిపుచ్చింది.

దశాబ్దాలుగా సాగిన న్యాయపోరాటాల ద్వారా ఆలయ యాజమాన్య హక్కులు, ప్రస్తుతం కొనసాగుతున్న ధార్మిక సంప్రదాయాలు ఇప్పటికే స్పష్టమయ్యాయని దేవాదాయ శాఖ పేర్కొంది. 1923 నాటి సివిల్ కోర్టు డిక్రీని, 1931లో ప్రివీ కౌన్సిల్ పునరుద్ధరించిన తీర్పును ప్రస్తావిస్తూ తిరుప్పరంకుండ్రం కొండ అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయానికే చెందుతుందని తమిళనాడు దేవాదాయ శాఖ కమిషనర్ టీజీ వినయ్ తన అఫిడవిట్‌లో వెల్లడించారు.

పిటిషనర్‌ ‘హిందూ ధర్మ పరిషత్‌’ లేవనెత్తిన మూడు ప్రధాన డిమాండ్లను తమిళనాడు దేవాదాయ శాఖ వ్యతిరేకించింది. కార్తీక దీపం వెలిగించే సంప్రదాయంపై వివరణ ఇస్తూ.. ఉచ్చిపిళ్లైయార్ ఆలయ సమీపంలోని దీప మండపంలోనే ఏటా పండుగ దీపాన్ని వెలిగిస్తున్నారని దేవాదాయ శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. కొండపైభాగంలోగానీ, ప్రస్తుతం ‘దీపతూణ్‌’గా పిలుస్తున్న రాతి స్తంభం వద్దగానీ గతంలో దీపం వెలిగించే సంప్రదాయం లేదని పేర్కొన్నారు.

అలాగే, తిరుప్పరంకుండ్రం కొండను భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కు అప్పగించాలన్న డిమాండ్‌ను కూడా దేవాదాయ శాఖ తోసిపుచ్చింది. ఈ ప్రాంతంలో పురావస్తు సంరక్షణ అనేది రాతి గుహలు, శాసనాలు వంటి నిర్దిష్ట చారిత్రక కట్టడాలకే పరిమితమని వివరించింది. ఈ నిబంధనలు కొండ మొత్తానికి లేదా నిత్యం పూజలు నిర్వహించే ఆలయానికి వర్తించవని కమిషనర్ తన వాదనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *