
ఆ రెండు పార్టీలు ఒకప్పుడు బలమైన రాజకీయ మిత్రపక్షాలు. ఐదుసార్లు కలిసి ఎన్నికల బరిలోకి దిగగా.. మూడుసార్లు అధికారాన్ని దక్కించుకున్నాయి. అయితే ఆరేళ్ల క్రితం రాజకీయ విభేదాలతో విడిపోయాయి. ఆ తర్వాత జరిగిన రెండు కీలక ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయడం ఇరు పార్టీలకు నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు ఒక పార్టీకి రాజకీయంగా డూ ఆర్ డైగా మారగా.. మరో పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో గత విభేదాలను పక్కనపెట్టి, రాజకీయ ప్రయోజనాల కోసం పాత మిత్రపక్షాలు మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్లుగా దూరంగా ఉంటున్న పాత మిత్రపక్షాలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శిరోమణి అకాలీదళ్ మరోసారి చేతులు కలిపాయి. గురుపూర్ణిమ పర్వదినం సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు. ఈ పరిణామంతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 24 ఏళ్ల పాటు బీజేపీతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన అకాలీదళ్.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020లో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ఆరేళ్ల తర్వాత మళ్లీ ఒక్కటైన పాత మిత్రులు
బీజేపీ, అకాలీదళ్ మళ్లీ పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ గత వారం రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ సిక్కులు పవిత్రంగా భావించే గురునానక్ జయంతి రోజున ఇరు పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. అయితే సీట్ల పంపకం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బడా భాయ్ (సుఖ్బీర్ సింగ్ బాదల్) ఉండే అవకాశాలున్నాయని అమిత్ షా తన వ్యాఖ్యలతో సంకేతాలు ఇచ్చారు. అకాలీదళ్ తిరిగి ఎన్డీయేలో చేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ పొత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. బీజేపీ, అకాలీదళ్ కలయిక హిందూ, సిక్కు సమాజాల మధ్య సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో మాకు ఎంతోకాలంగా సన్నిహిత అనుబంధం ఉంది. అదేవిధంగా బీజేపీ, అకాలీదళ్ మధ్య కూడా బలమైన రాజకీయ బంధం కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల పొత్తు పంజాబ్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందూ-సిక్కు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని భావిస్తున్నాను’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తే 2029 డిసెంబర్ నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు.
1996లో కుదిరిన బీజేపీ-అకాలీదళ్ పొత్తు
బీజేపీ ఆవిర్భావానికి ముందే దాని పూర్వ రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ్‌తో శిరోమణి అకాలీదళ్‌కు అనుబంధం ఉంది. 1967లోనే ఈ రెండు పార్టీలు కలిసి అప్పటికి కొత్తగా ఏర్పడిన పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత 1996లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మధ్య అధికారికంగా పొత్తు కుదిరింది. 1997 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ పార్టీలు ఘన విజయం సాధించి పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరుసటి ఏడాది అకాలీదళ్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇరు పార్టీల మధ్య రాజకీయ స్నేహం కొనసాగింది.
అయితే 2020లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఈ మైత్రికి అడ్డంకిగా మారాయి. ఆ చట్టాలను పంజాబ్ రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అకాలీదళ్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ క్రమంలోనే బీజేపీతో విభేదించిన శిరోమణి అకాలీదళ్ 24 ఏళ్ల రాజకీయ బంధానికి స్వస్తి పలుకుతూ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగింది. తాజాగా ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ రెండు పార్టీలు చేతులు కలపడం పంజాబ్ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
దీంతో 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ వేర్వేరుగా పోటీ చేసి భారీగా నష్టపోయాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం కాగా.. అకాలీదళ్ మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏకంగా 92 స్థానాల్లో విజయం సాధించి పంజాబ్‌లో అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం కొంత పెరిగినప్పటికీ పంజాబ్‌లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అకాలీదళ్ పరిస్థితి మరింత దిగజారింది. ఆ పార్టీ ఓటు బ్యాంకు ఏకంగా 14 శాతం తగ్గడంతోపాటు, పోటీ చేసిన పది స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది.
గ్రామీణ, పట్టణ ఓటర్లే కీలకం
పంజాబ్ రాజకీయాల్లో ఈ రెండు పార్టీలకు వేర్వేరు ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది. సిక్కులు అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో శిరోమణి అకాలీదళ్‌కు గట్టి పట్టు ఉండగా.. హిందువులు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ ఉంది. అయితే గ్రామీణ ఓటర్ల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని, పట్టణ ఓటర్ల మద్దతు లేకుండా అకాలీదళ్ విజయం సాధించడం సులభం కాదని ఇరు పార్టీలు గుర్తించాయి. విడివిడిగా పోటీ చేయడం వల్ల రెండు పార్టీలూ రాజకీయంగా నష్టపోతున్నాయని భావించాయి.
మరోవైపు పంజాబ్‌లో అకాలీదళ్ అధికారానికి దూరమై దాదాపు పదేళ్లు కావస్తోంది. వరుస ఎన్నికల పరాజయాలతో పార్టీలో అంతర్గత విభేదాలు, చీలికలు కూడా పెరుగుతున్నాయి. అటు బీజేపీ సైతం రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న రెండు పార్టీలు పాత విభేదాలను పక్కనపెట్టి మళ్లీ పొత్తు దిశగా అడుగులు వేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ద్వారా తమ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
పంజాబ్‌లో అకాలీదళ్-బీజేపీది హిట్ కాంబినేషన్
| సంవత్సరం | మొత్తం సీట్లు | అకాలీదళ్ గెలిచినవి | బీజేపీ గెలిచినవి | ఫలితం |
|---|---|---|---|---|
| 1997 | 117 | 75 | 18 | అధికారం |
| 2002 | 117 | 41 | 3 | ఓటమి |
| 2007 | 117 | 48 | 19 | అధికారం |
| 2012 | 117 | 56 | 12 | అధికారం |
| 2017 | 117 | 15 | 3 | ఓటమి |
పంజాబ్ రాజకీయాల్లో శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమిని ఒక విజయవంతమైన రాజకీయ జోడీగా చెప్పుకోవచ్చు. 1997 నుంచి 2017 వరకు జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయగా.. మూడుసార్లు (1997, 2007, 2012) అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ మూడు పర్యాయాల్లోనూ అకాలీదళ్ అగ్రనేత ప్రకాశ్ సింగ్ బాదల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
1966లో పంజాబ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి కూటమిగా అకాలీదళ్-బీజేపీ ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామీణ ప్రాంతాల్లో అకాలీదళ్ బలం, పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న మద్దతు ఈ కూటమి విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. అందుకే ఆరేళ్ల విరామం తర్వాత ఈ రెండు పార్టీలు మళ్లీ ఒక్కటవడం పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.
పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2022లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏకంగా 92 సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ మూడు సీట్లు, బీజేపీ రెండు సీట్లు గెలుచుకోగా.. బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు చెరో స్థానంలో విజయం సాధించారు.
2027 ఎన్నికల్లో బహుముఖ పోరు!
వచ్చే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ-అకాలీదళ్ కూటమితో పాటు ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నాయకత్వంలోని కొత్త పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. మరోవైపు ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాలన్నీ పంజాబ్ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. పాత మిత్రులైన బీజేపీ, అకాలీదళ్ తిరిగి చేతులు కలపడం, కొత్త రాజకీయ శక్తుల ప్రవేశంతో వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఏ పార్టీ లేదా కూటమి మ్యాజిక్ ఫిగర్ అయిన 59 సీట్లను సాధించి అధికారాన్ని దక్కించుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.



