తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపోత్సవం సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదాస్పద దీపస్తంభం వద్ద దీపం వెలిగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో రాజకీయ వివాదం ముదిరింది. ఈ ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో మరింత సందిగ్ధత ఏర్పడింది.

పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొండ పరిసరాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు సుమారు 5,600 మంది పోలీసులను మోహరించారు. డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌ను గృహనిర్బంధంలో ఉంచగా, సుమారు 750 మంది నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో తిరుప్పరంకుండ్రం దీపోత్సవ వివాదం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నవంబర్ 24, మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండపై ఉన్న వివాదాస్పద రాతి స్తంభం ‘దీపతూన్’ వద్ద దీపం వెలిగించే అంశం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. మంగళవారం సాయంత్రం దీపం వెలిగిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

తిరుప్పరంకుండ్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పోలీసులను మోహరించారు. మదురై పోలీస్ కమిషనర్ రాజేంద్రన్ ఆదేశాల మేరకు నలుగురు డీఐజీలు, ఏడుగురు ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలు, 45 మంది డీఎస్పీలు, 100 మందికి పైగా ఇన్‌స్పెక్టర్లతో పాటు మొత్తం సుమారు 5,600 మంది పోలీసు సిబ్బందిని కొండ పరిసరాల్లో భద్రతా విధులకు నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

తిరుప్పరంకుండ్రం కొండ ప్రాంతంలో జిల్లా యంత్రాంగం కఠిన ఆంక్షలు విధించింది. 144 సెక్షన్ (బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163) కింద నిషేధాజ్ఞలు అమలు చేస్తూ బహిరంగ సభలు, నిరసనలు, ఊరేగింపులపై ఆంక్షలు విధించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు సంబంధించిన కార్యకలాపాలకు మినహా ఇతరులెవరూ కొండపైకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

నవంబర్ 23, 24 తేదీల్లో తిరుప్పరంకుండ్రం ప్రాంతాన్ని డ్రోన్ రెడ్ జోన్‌గా ప్రకటించారు. అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయం, సికందర్ బాదుషా దర్గా, కాశీ విశ్వనాథర్ ఆలయాల పరిసరాల్లో 70కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీసు బృందాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.

బీజేపీ నేతలకు అడ్డంకులు.. 750 మందికి ముందస్తు నిర్బంధం

మరోవైపు, దీపతూన్ వద్ద దీపం వెలిగించేందుకు వెళ్లాలని ప్రయత్నించిన బీజేపీ, హిందూ మున్నాని నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పాలయంకొట్టైలోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. ఆయన మదురై వెళ్లేందుకు ప్రయత్నిస్తే అదుపులోకి తీసుకుంటామని తిరునెల్వేలి పోలీస్ కమిషనర్ శేఖర్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు.

తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో సోమవారం రాత్రే సుమారు 750 మందిని పోలీసులు వారి ఇళ్ల వద్దే నిలువరించారు. మరో ముగ్గురు హిందూ మున్నాని నేతలను ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో దీపోత్సవ వివాదం కేవలం మతపరమైన అంశంగానే కాకుండా తమిళనాడు రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.

సికందర్ బాదుషా దర్గా సమీపంలోని వివాదాస్పద దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలా? లేక ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద ఉన్న సంప్రదాయ ప్రదేశంలోనే దీపోత్సవం నిర్వహించాలా? అన్న అంశమే ప్రస్తుతం తిరుప్పరంకుండ్రం వివాదానికి ప్రధాన కారణంగా మారింది.

ఈ అంశంపై నవంబర్ 20న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదికి మాత్రమే పరిమితంగా, ఎంపిక చేసిన బృందంతో దీపతూన్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతించింది. ఆలయ అధికారులు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఖరారు చేసిన బృందానికి మాత్రమే ఈ అవకాశం కల్పించింది.

అదే సమయంలో దర్గా, మసీదుకు వెళ్లే భక్తులు, సందర్శకులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మధ్యంతర అనుమతి భవిష్యత్తులో ఎలాంటి హక్కులకు ఆధారంగా మారబోదని కూడా పేర్కొంది.

అయితే, ప్రధాన వివాదం ఇంకా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండటంతో తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ నవంబర్ 21న సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపించాలని కోరినప్పటికీ, సోమవారం ధర్మాసనం అందుబాటులో లేకపోవడంతో వెంటనే విచారణ సాధ్యపడలేదు. దీంతో దీపోత్సవం నిర్వహణపై ఉత్కంఠ కొనసాగింది.

తిరుప్పరంకుండ్రం దీపోత్సవ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను గౌరవించని క్రిస్టియన్‌గా విజయ్‌ను ప్రజలు చూస్తారని, ఆయన హిందూ సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కూడా నైనార్ నాగేంద్రన్‌తో పాటు బీజేపీ నేతలను అక్రమంగా గృహనిర్బంధంలో ఉంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అయితే ఈ వివాదంపై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల అమలుతో తలెత్తే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని టీవీకే ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడాన్ని మరికొన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి. దీంతో తిరుప్పరంకుండ్రం దీపోత్సవ వివాదం తమిళనాడులో రాజకీయంగా మరింత వేడెక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *