జాతీయ ప్రతినిధి: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి సీట్ల పంపకాలపై కసరత్తు ముమ్మరం చేశాయి. మిత్రపక్షాల డిమాండ్లతో రెండు కూటముల్లోనూ సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

140 స్థానాలు కోరుతున్న ఎన్డీఏ మిత్రపక్షాలు

403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో బీజేపీ మిత్రపక్షాలైన అప్నా దళ్‌ (ఎస్‌), ఆర్‌ఎల్‌డీ, ఎస్‌బీఎస్పీ, నిషాద్‌ పార్టీలు కలిపి సుమారు 140 స్థానాలను కోరుతున్నట్లు సమాచారం.

అప్నా దళ్‌ (ఎస్‌) 52 సీట్లు ఆశిస్తుండగా, నిషాద్‌ పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసిన 15 స్థానాల కంటే ఎక్కువ కావాలని పట్టుబడుతోంది. ఆర్‌ఎల్‌డీ 30కి పైగా స్థానాలను కోరుతుండగా, ఎస్‌బీఎస్పీ 42 నియోజకవర్గాలతో కూడిన జాబితాను బీజేపీ నాయకత్వానికి అందించినట్లు తెలుస్తోంది.

బీజేపీకి సీట్ల సర్దుబాటు సవాల్

మిత్రపక్షాల డిమాండ్లతో బీజేపీ నాయకత్వానికి సీట్ల కేటాయింపు కష్టంగా మారింది. భాగస్వామ్య పార్టీలను సంతృప్తిపరుస్తూనే సొంత పార్టీ ఆశావహులకు న్యాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ డిమాండ్లపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్‌కు ఎస్పీ 26 సీట్ల ఆఫర్

మరోవైపు ఇండియా కూటమిలోనూ సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. 2027 ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై ఎస్పీ, కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో రెండో విడత చర్చలు జరిపారు. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం జరిగినా తుది ఒప్పందం కుదరలేదు.

మొత్తం 403 స్థానాల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు కేటాయించాలని ఎస్పీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌ మాత్రం 130 స్థానాలతో కూడిన జాబితాను అందించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది.

రెండు కూటముల్లోనూ సీట్ల సర్దుబాటు చర్చలు కీలక దశకు చేరడంతో 2027 యూపీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి పెరుగుతోంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *