ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతకంపై ప్రముఖ జ్యోతిష్య పండితుడు లక్ష్మీకాంత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన వ్యక్తిగత, వైవాహిక జీవితానికి సంబంధించిన పరిణామాలపై స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాల ప్రభావం ఆయన రాజకీయ జీవితంపై ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఎన్ని విమర్శలు, అపనిందలు ఎదురైనా రాజకీయంగా ఆయనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నాలుగో వివాహం చేసుకుంటారంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన అసందర్భమైన వ్యాఖ్యగా అభివర్ణించారు. ఈ ప్రచారానికి సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడిస్తూ పలు కారణాలను వివరించారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతకం ఎంతో బలంగా ఉందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు లక్ష్మీకాంత్ శర్మ అభిప్రాయపడ్డారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితానికి సంబంధించిన పరిణామాలపై స్పందించిన ఆయన.. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ జాతకానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులోనూ ఏపీ కూటమి కీలకంగా వ్యవహరించిందని లక్ష్మీకాంత్ శర్మ పేర్కొన్నారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ జాతక బలం వల్లే సాధ్యమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు ప్రజల్లో ఆదరణ, పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా 2027 మార్చి తర్వాత పవన్ కళ్యాణ్ జాతకం మరింత అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితుడు వెల్లడించారు

జూన్ నుంచి శని గ్రహం మేషరాశిలోకి ప్రవేశించిన తర్వాత పవన్ కళ్యాణ్‌కు మరింత యోగం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు లక్ష్మీకాంత్ శర్మ తెలిపారు. మేషరాశిలో శని నీచస్థితిలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ జాతకంలో ఉన్న గ్రహబలం కారణంగా ఆయనకు మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎన్ని విమర్శలు, అపనిందలు ఎదురైనా అవి ఆయనపై పెద్దగా ప్రభావం చూపలేవన్నారు.

పవన్ కళ్యాణ్‌ది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రమని లక్ష్మీకాంత్ శర్మ వివరించారు. పేరు ఆధారంగా ఆయనది కన్యారాశి అని చెప్పడం సరికాదన్నారు. వ్యక్తి పుట్టిన సమయంలో చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడనే దాని ఆధారంగానే జన్మరాశిని నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. 2027 మార్చి తర్వాత పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా, వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని జోస్యం చెప్పారు. ఇక నాలుగో వివాహం గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. గ్రహాల స్థితిగతులను పరిశీలిస్తే 2029 అక్టోబర్ వరకు ఆయనకు వివాహ యోగం లేదని, ఈ నేపథ్యంలో నాలుగో వివాహం గురించి మాట్లాడటం అసందర్భమని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌కు దశాయోగం

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో జరగాల్సిన పరిణామాలు ఇప్పటికే జరిగిపోయాయని, ఇక ప్రత్యేకంగా ఆయనకు జరిగే నష్టం ఏమీ లేదని లక్ష్మీకాంత్ శర్మ అభిప్రాయపడ్డారు. వైవాహిక జీవితానికి సంబంధించి పవన్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనదని, అయితే ఆయనకున్న ప్రజాదరణ కారణంగా ఈ అంశం ఎక్కువగా చర్చకు వస్తోందన్నారు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ జాతకంలోని సప్తమ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయని, రవి, బుధ, శుక్ర గ్రహాల ప్రభావం ఆయన వైవాహిక జీవితంలో ప్రతికూలతలకు కారణమైందని లక్ష్మీకాంత్ శర్మ వివరించారు. వ్యక్తిగత జీవితంలో పవన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపబోవని పేర్కొన్నారు. ఒక వ్యక్తి జీవితంలో దశ, అంతర్దశలు ఎంతో కీలకమని, పవన్ కళ్యాణ్ రాబోయే గ్రహదశలను పరిశీలిస్తే ఆయనకు మంచి దశాయోగం ఉందని జ్యోతిష్య పండితుడు వెల్లడించారు.

ఇటీవల ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితానికి సంబంధించి చేసిన జాతక వ్యాఖ్యలను లక్ష్మీకాంత్ శర్మ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా గురు గ్రహం నీచస్థితిలో ఉండటం వల్ల వైవాహిక సమస్యలు తలెత్తవని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రుడు నీచస్థితిలో ఉన్నప్పుడు లేదా శుక్ర గ్రహ దోషం ఏర్పడినప్పుడే కలత్ర దోషం వచ్చే అవకాశముంటుందని వివరించారు. పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలకు శుక్ర గ్రహ ప్రభావమే కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో గురు గ్రహాన్ని కారణంగా చూపుతూ చెప్పిన జాతక విశ్లేషణ సరైనది కాదని వ్యాఖ్యానించారు.

ఒకవేళ నిజంగానే గురు గ్రహం నీచస్థితిలో ఉన్నప్పటికీ, దాని వల్ల వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని లక్ష్మీకాంత్ శర్మ తెలిపారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహ దోషం ఉంటే వివాహం జరగడంలో ఆటంకాలు ఎదురవుతాయని, శుక్ర గ్రహ దోషం ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు, విడాకులు వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఇక గురు గ్రహానికి సంబంధించిన దోషాల వల్ల విద్య, ఆర్థిక పరిస్థితులు, ప్రతిష్ఠకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *