ఇటీవల కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి.. బుధవారం తన పార్టీ పీఆర్పీ తరఫున భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. పార్టీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని, అట్టడుగు వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాలకు సముచిత అవకాశాలు కల్పించేలా పార్టీ నిర్మాణం ఉంటుందని తెలిపారు. అలాగే ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఉగాది తర్వాత తన పాదయాత్ర ప్రారంభమవుతుందని విజయసాయిరెడ్డి ప్రకటించారు.

పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఉగాది తర్వాత తన యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీలపై విమర్శలు చేశారు. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో రెండు కుటుంబాలే అధికారాన్ని చెలాయిస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యువత, ముఖ్యంగా జెన్-జీ తరం రాజకీయాల్లోకి రావాలని, చట్టాలు రూపొందించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

తమ పార్టీలో సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోనని వెల్లడించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే తరహాలో రాజకీయ సలహాదారుడిగా, మార్గదర్శకుడిగా మాత్రమే వ్యవహరిస్తానని పునరుద్ఘాటించారు. పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ఇటీవల పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ)కి సంబంధించి మూడు కీలక పదవులను విజయసాయిరెడ్డి ప్రకటించారు. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఆమె తనకు కుమార్తె వరుస అవుతారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా వేణుంబాక విజయసాయిరెడ్డి కొనసాగుతుండగా, కోశాధికారిగా దక్షిణామూర్తిని నియమించారు.

మరోవైపు పీఆర్పీ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలను విజయసాయిరెడ్డి ఖండించారు. తప్పుడు ప్రచారాలతో తమ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీఆర్పీ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *