పెళ్లిళ్లు, శుభకార్యాల్లో పిలవని అతిథుల బెడద నిర్వాహకులకు కొత్త తలనొప్పిగా మారుతోంది. ఆహ్వానం లేకుండానే ఫంక్షన్లకు వచ్చి భోజనాలు చేయడంతో, ముందుగా అంచనా వేసి సిద్ధం చేసిన వంటకాలు త్వరగా అయిపోతున్నాయి. దీంతో అసలైన బంధుమిత్రులకు భోజనం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో వనపర్తి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన హెచ్చరిక ఫ్లెక్సీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆహ్వానం లేకుండా వచ్చి భోజనం చేస్తూ పట్టుబడితే బీఎన్‌ఎస్ సెక్షన్ 329 కింద మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తారని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

అయితే ఈ హెచ్చరిక ఇప్పుడు పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఆహ్వానం లేకుండా పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లి భోజనం చేయడం నిజంగానే చట్టరీత్యా నేరమా? ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక చట్టపరమైన ఆధారం ఉందా? బీఎన్‌ఎస్ సెక్షన్ 329 ఈ తరహా చర్యలకు వర్తిస్తుందా? లేక అతిథులను హెచ్చరించేందుకు మాత్రమే ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారా? అనే చర్చ మొదలైంది.

పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలు జరిగే ఫంక్షన్ హాళ్లకు ఆహ్వానం లేకుండానే వెళ్లి భోజనం చేసే వారి సంఖ్య కొన్ని చోట్ల పెరుగుతోంది. సాధారణంగా ఫంక్షన్ హాళ్ల ప్రవేశ ద్వారాల వద్ద వేడుక నిర్వహిస్తున్న కుటుంబాల పేర్లతో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. వీటిని చూసి ఎవరి ఇంట్లో శుభకార్యం జరుగుతుందో తెలుసుకోకుండానే కొందరు లోపలికి వెళ్లి భోజనం చేసి వస్తుంటారు. మరికొందరు తెలిసినవారి వేడుకగా భావించి ఎలాంటి ఆహ్వానం లేకుండానే హాజరవుతున్నారు.

అయితే ముందుగానే అతిథుల సంఖ్యను అంచనా వేసుకుని వంటకాలు సిద్ధం చేసుకునే కుటుంబాలకు ఇలాంటి పరిణామాలు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అనుకున్న దానికంటే ఎక్కువ మంది భోజనాలకు రావడంతో వంటకాలు త్వరగా అయిపోతున్నాయి. ఫలితంగా అసలైన ఆహ్వానితులకు భోజనం సరిపోని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకవైపు అవసరానికి మించి ఆహారం సిద్ధం చేస్తే వృథా అయ్యే ప్రమాదం ఉండగా.. మరోవైపు అనుకోని అతిథుల రాకతో ఆహ్వానించిన బంధుమిత్రులకు భోజనం అందక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో వనపర్తి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన హెచ్చరిక ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఎలాంటి ఆహ్వానం లేకుండా వచ్చి భోజనం చేసే వారిని ఉద్దేశించి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. శుభకార్యంతో ఎలాంటి సంబంధం లేకుండా ఫంక్షన్ హాల్‌లోకి ప్రవేశించి భోజనం చేస్తూ పట్టుబడితే భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 329 కింద మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

బీఎన్‌ఎస్ సెక్షన్ 329 ఏం చెబుతోంది?

భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 329 క్రిమినల్ ట్రెస్‌పాస్ (నేరపూరిత అక్రమ ప్రవేశం)కు సంబంధించినది. ఇతరుల ఆధీనంలో ఉన్న ఆస్తిలోకి నేరం చేయాలనే ఉద్దేశంతో లేదా అక్కడి వ్యక్తులను భయపెట్టడం, అవమానించడం, ఇబ్బందులకు గురిచేయడం వంటి దురుద్దేశాలతో ప్రవేశించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది.

బీఎన్‌ఎస్ సెక్షన్ 329(3) ప్రకారం క్రిమినల్ ట్రెస్‌పాస్ నేరం రుజువైతే మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5 వేల వరకు జరిమానా లేదా ఈ రెండూ విధించే అవకాశం ఉంటుంది. గతంలో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 447 కింద ఇలాంటి నేరానికి గరిష్ఠంగా రూ.500 జరిమానా ఉండేది. కొత్త చట్టంలో ఈ జరిమానాను రూ.5 వేలకు పెంచారు.

ఈ నేరం కాగ్నిజబుల్, బెయిలబుల్ పరిధిలోకి వస్తుంది. అయితే కేవలం ఆహ్వానం లేకుండా ఫంక్షన్ హాల్‌కు వెళ్లి భోజనం చేసినంత మాత్రాన ఆటోమేటిక్‌గా క్రిమినల్ ట్రెస్‌పాస్ నేరం వర్తించదు. నేరపూరిత ఉద్దేశం, ఇతర చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. నేరం జరిగినట్లు నిర్ధారించడం, శిక్ష విధించడం పూర్తిగా న్యాయస్థానం పరిధిలోని అంశాలని న్యాయ నిపుణులు వివరిస్తున్నారు.

ఆహ్వానం లేకుండా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు వెళ్లి భోజనం చేయడం సామాజికంగా అనుచితమైన ప్రవర్తనగానే పరిగణించవచ్చు. అయితే ప్రతి సందర్భంలోనూ దీన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేము. ఆయా సందర్భాల్లో వ్యక్తి ఉద్దేశం, ప్రవర్తన, అక్కడి పరిస్థితులను బట్టి చట్టపరమైన చర్యలు ఆధారపడి ఉంటాయి.

ఉదాహరణకు.. తెలిసినవారి ఇంట్లో శుభకార్యం జరుగుతోందని పొరపాటున భావించి ఫంక్షన్‌కు వెళ్లడం లేదా తమకు ఆహ్వానం ఉందని అపార్థం చేసుకుని భోజనం చేయడం వంటి సందర్భాలను ఉద్దేశపూర్వక మోసం లేదా నేరపూరిత అక్రమ ప్రవేశంగా పరిగణించలేము. అయితే అతిథిగా నటిస్తూ నిర్వాహకులను మోసం చేయాలనే ఉద్దేశంతో ఫంక్షన్ హాల్‌లోకి ప్రవేశించి భోజనం చేస్తే బీఎన్‌ఎస్ సెక్షన్ 318 కింద మోసం నిబంధనలు వర్తించే అవకాశం ఉంటుంది. అదే విధంగా దురుద్దేశంతో ఇతరుల ఆధీనంలోని ప్రదేశంలోకి ప్రవేశించినట్లు ఆధారాలు ఉంటే సెక్షన్ 329 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.

అయితే కేవలం ఆహ్వానం లేకుండా ఫంక్షన్ హాల్‌లోకి ప్రవేశించి భోజనం చేశారనే కారణంతోనే ఈ సెక్షన్ల కింద శిక్ష విధించలేరు. సంబంధిత వ్యక్తికి నేరపూరిత ఉద్దేశం ఉందనే విషయాన్ని చట్టపరంగా నిరూపించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి సందర్భాన్ని దాని స్వభావం, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుందని న్యాయపరమైన నిపుణులు సూచిస్తున్నారు

ఫంక్షన్ హాల్‌లోకి ఎవరిని అనుమతించాలనే విషయంలో యాజమాన్యానికి, హాల్‌ను అద్దెకు తీసుకున్న శుభకార్యం నిర్వహించే కుటుంబానికి తగిన హక్కులు ఉంటాయి. అవసరమైతే అతిథులను ఆహ్వాన పత్రిక చూపించాలని అడగవచ్చు. వేడుకతో సంబంధం లేని వ్యక్తులను ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని సూచించే అధికారం కూడా ఉంటుంది. ఇలాంటి నిబంధనలపై అవగాహన కల్పించేందుకు హెచ్చరిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలోనూ తప్పులేదు.

అయితే చట్టం పేరుతో ఫంక్షన్ హాల్ యాజమాన్యం స్వయంగా శిక్ష విధించడం, జరిమానాలు వసూలు చేయడం మాత్రం సాధ్యం కాదు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ పట్టుబడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు చట్టప్రకారం విచారణ జరిపి, నేరం జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటారు.

అలాగే అనుమానితులను అక్రమంగా నిర్బంధించడం, వారిపై దాడి చేయడం లేదా బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే ఫంక్షన్ హాల్ యాజమాన్యమే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతేకాకుండా వ్యక్తుల ఫొటోలు, వ్యక్తిగత వివరాలను సరైన ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే పరువునష్టం వంటి వివాదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలను చట్ట పరిధిలోనే పరిష్కరించుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *