అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో ప్రతిష్ఠాత్మకమైన థామస్‌, ఉబర్‌ కప్ ఫైనల్స్‌కు 2028లో భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దేశ రాజధాని న్యూదిల్లీలో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈసారి పోటీల్లో కొత్త ఫార్మాట్‌ను అమలు చేయనున్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో 24 జట్ల చొప్పున పోటీపడనుండగా.. ప్రతి టైను ఐదు మ్యాచ్‌లకు బదులుగా మూడు మ్యాచ్‌లకే పరిమితం చేయనున్నారు.

రెండోసారి భారత్‌లో టోర్నీ

థామస్‌-ఉబర్‌ కప్ ఫైనల్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 2014లో తొలిసారిగా న్యూదిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ పోటీలు జరిగాయి. ఆ టోర్నీలో భారత మహిళల జట్టు తొలిసారి ఉబర్‌ కప్ కాంస్య పతకాన్ని సాధించింది. 2016లోనూ మరోసారి కాంస్యంతో సత్తా చాటింది. ఇక 2022లో భారత పురుషుల జట్టు థామస్‌ కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇటీవల 2026లో డెన్మార్క్‌లో జరిగిన టోర్నీలో సెమీఫైనల్‌కు చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

24 జట్లతో కొత్త ఫార్మాట్

2028 నుంచి థామస్‌, ఉబర్‌ కప్‌లలో పోటీ విధానం మారనుంది. ఒక్కో టోర్నీలో 24 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోనున్నాయి. ప్రతి జట్టు లీగ్ దశలో నాలుగు టైల్లో ఆడుతుంది. ఈ దశలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన 12 జట్లు నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.

ఇప్పటివరకు ఒక్కో టైలో ఐదు మ్యాచ్‌లు నిర్వహించేవారు. కొత్త విధానంలో మూడు మ్యాచ్‌లకే పోటీని పరిమితం చేయనున్నారు. అంటే రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్టు టైలో విజయం సాధిస్తుంది. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ విజయానికి పాయింట్లు కేటాయించడంతో పాటు, టై గెలిచిన జట్టుకు అదనంగా బోనస్ పాయింట్లు కూడా లభిస్తాయి. ఈ మార్పులతో పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుందని బీడబ్ల్యూఎఫ్ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *