
తిరుమల శ్రీవారి భక్తుడైన వర్ధమాన్ జైన్ ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించి వార్తల్లో నిలిచారు. గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 121 కిలోల స్వర్ణాభరణాలను టీటీడీ ఈవోకు అందజేశారు. ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని విరాళంగా అందించిన వర్ధమాన్ జైన్ ఎవరనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. అసలు ఆయన ఏం చేస్తుంటారు? ఆయన వ్యాపార నేపథ్యం ఏమిటి? ఇంతటి భారీ విరాళం అందించే స్థాయికి ఎలా ఎదిగారు? అనే వివరాలు తెలుసుకుందాం.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. తిరుమల చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో బంగారు కానుక అందడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ని కిలోల బంగారాన్ని స్వామివారికి విరాళంగా అందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఇంతటి భారీ కానుక సమర్పించిన భక్తుడు ఎవరనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
121 కిలోల బంగారం సమర్పించిన భక్తుడు ఎవరు?
ఇప్పటివరకు ఈ భారీ విరాళం అందించిన భక్తుడి వివరాలను గోప్యంగా ఉంచారు. తాజాగా ఆయన ఎవరనే విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ వర్ధమాన్ జైన్ ఈ అపురూప కానుకను అందించారు. గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 121 కిలోల బంగారు ఆభరణాలను టీటీడీ ఈవోకు అందజేశారు. ఈ భారీ విరాళంతో వర్ధమాన్ జైన్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
శ్రీవారిని అత్యంత వైభవంగా అలంకరించేలా ఈ బంగారు ఆభరణాలను ప్రత్యేకంగా రూపొందించారు. వీటిలో కిరీటం, శంఖుచక్రాలు, వడ్డాణం, కటి వరద హస్తాలు, పాదుకలు తదితరాలతో కలిపి మొత్తం 46 రకాల ఆభరణాలు ఉన్నాయి. టీటీడీ అధికారులు, అర్చకులు, బొక్కసం విభాగం అధికారుల సూచనలు, సలహాల మేరకు ప్రముఖ జ్యువెలరీ సంస్థ ద్వారా వీటిని అత్యంత కళాత్మకంగా తయారు చేయించినట్లు సమాచారం.
కంపెనీలో వాటా విక్రయించి స్వామివారికి కానుక
వర్ధమాన్ జైన్ తన సంస్థలో 60 శాతం వాటాను విక్రయించడం ద్వారా వచ్చిన సుమారు రూ.6,000 కోట్లలో కొంత మొత్తాన్ని శ్రీవారి సేవకు కేటాయించినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయన సమర్పించిన బంగారు ఆభరణాలను భక్తులు వీక్షించేందుకు తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. అయితే ఈ నూతన ఆభరణాలతో స్వామివారిని అభిషేకం అనంతరం అలంకరించనున్నారు.
వర్ధమాన్ జైన్‌కు శ్రీవారిపై ఉన్న భక్తి ఈ విరాళంతోనే ఆగిపోలేదు. గతంలోనూ ఆయన పలు రూపాల్లో టీటీడీకి సహకారం అందించారు. 2025 జనవరి 19న రూ.6 కోట్ల విరాళం ఇవ్వడంతోపాటు, ఈ ఏడాది మే 16న ఒక ఎలక్ట్రిక్ బస్సును కూడా కానుకగా సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
వర్ధమాన్ జైన్ విద్యాభ్యాసం విషయానికి వస్తే.. ఆయన చెన్నైలోని లయోలా కళాశాల నుంచి స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని ఆస్టిన్‌లో ఉన్న టెక్సాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. హెల్త్‌కేర్ టెక్నాలజీ, బీపీవో, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటి రంగాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. అంతేకాకుండా ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ కోడింగ్‌కు సంబంధించిన పలు పేటెంట్లు కూడా ఆయన సొంతం చేసుకున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార ప్రస్థానం
వర్ధమాన్ జైన్ హెల్త్‌కేర్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన యాక్సెస్ హెల్త్‌కేర్‌కు వ్యవస్థాపకుడిగా, వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సంస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2025లో తన కంపెనీలోని 70 శాతం వాటాను ఓ అమెరికన్ సంస్థకు సుమారు 2 బిలియన్ డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ భారీ ఒప్పందంతో కార్పొరేట్ రంగంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది.
ప్రస్తుతం వర్ధమాన్ జైన్ ఏషియా (చెన్నై) ఇంజనీరింగ్ అనే సివిల్ ఇంజనీరింగ్ సంస్థకు సహ యజమానిగా, డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అలాగే వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపార రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన.. తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.



