నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో కనిగిరి వరకు నిర్మాణ పనులు పూర్తికావడంతో స్థానికుల్లో రైలు సర్వీసులపై ఆశలు చిగురించాయి. కొత్త రైళ్ల రాకపోకలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని దర్శి, కనిగిరి ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులోనే రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ గతంలో ప్రచారం జరిగినప్పటికీ.. ఇప్పటివరకు రైల్వే శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు గుంటూరు నుంచి కనిగిరి వరకు నేరుగా రైలు సర్వీసులు ప్రారంభిస్తే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభించే విషయంపై రైల్వే అధికారులు స్పష్టత ఇవ్వాలని దర్శి, కనిగిరి ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ నిలిచిపోయిన పనులను వేగవంతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో నడికుడి–శ్రీకాళహస్తి కొత్త రైల్వే మార్గం పనులు కూడా గత రెండున్నరేళ్లలో పురోగతి సాధించాయి. నడికుడి నుంచి కనిగిరి వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తికావడంతో పాటు కొత్త స్టేషన్లు సైతం సిద్ధమయ్యాయి. దీంతో కనిగిరి వరకు రైలు సర్వీసులు ప్రారంభించాలని స్థానికుల నుంచి చాలాకాలంగా డిమాండ్ వినిపిస్తోంది.

కనిగిరి వరకు రైల్వే లైన్ సిద్ధం కావడంతో అధికారులు ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. దీంతో గుంటూరు నుంచి కనిగిరి వరకు రైలు సర్వీసు ప్రారంభం కానుందనే ప్రచారం జోరుగా సాగింది. తొలుత దర్శి, కనిగిరి వరకు అయినా రైళ్లను నడుపుతామని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ఆగస్టులో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రైలు షెడ్యూల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు రైళ్ల రాకపోకలు ప్రారంభం కాలేదు.

మరోవైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రైల్వే అధికారులను కలిసి కనిగిరి వరకు రైలు సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ విషయంలో స్పష్టమైన పురోగతి కనిపించకపోవడంతో స్థానికుల్లో నిరాశ నెలకొంది.

నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో నడికుడి నుంచి కనిగిరి వరకు ట్రాక్ నిర్మాణ పనులు జనవరి నెల నాటికే పూర్తయ్యాయి. దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తయింది. అయితే ఈ స్టేషన్లకు ఇప్పటివరకు అధికారిక కోడ్ నంబర్లు కేటాయించలేదని తెలుస్తోంది. దీంతో రైలు సర్వీసుల ప్రారంభంలో జాప్యం జరుగుతోందనే చర్చ స్థానికంగా సాగుతోంది.

మరోవైపు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వల్లే రైళ్ల ప్రారంభం ఆలస్యమవుతోందని గతంలో అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే రైల్వే జోన్ కూడా ప్రారంభమైనప్పటికీ.. కనిగిరి వరకు రైళ్లను నడిపే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల ప్రజలు రైలు సర్వీసుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాదిలోనైనా రైళ్ల రాకపోకలు ప్రారంభించాలని కోరుతున్నారు.

రెండు జిల్లాల్లో ఇంకా కొన్ని పనులు పెండింగ్

పల్నాడు జిల్లాలోని నడికుడి నుంచి తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి వరకు మొత్తం 309 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఐదు దశలుగా విభజించి పనులు చేపట్టారు. ఇందులో మొదటి, రెండో దశల పనులు పూర్తయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని మూడు, నాలుగో దశ పనులు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నాయి.

ప్రకాశం జిల్లా పరిధిలో సుమారు 145 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణం గార్లపేట వరకు పూర్తయింది. గౌతువారిపల్లి, గార్లపేట రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. పేరంగడిపల్లి సమీపంలో జాతీయ రహదారి పనులు పూర్తయిన తర్వాత రైల్వే వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.

కనిగిరి వరకు రైల్వే లైన్, స్టేషన్లు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి అయినా రైలు సర్వీసులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తే దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల ప్రజలకు గుంటూరు, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడం సులభమవుతుందని అభిప్రాయపడుతున్నారు

నడికుడి–శ్రీకాళహస్తి కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు పలు రైల్వే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఒక మార్గం ఉంది. మరోవైపు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా కూడా రైళ్లు నడుస్తున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా తిరుపతికి చేరుకునే మరో మార్గం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం, సమయం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త మార్గం అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయ రైల్వే రూట్ లభించనుంది.

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పనులు ఎప్పటికి పూర్తవుతాయో?

ప్రస్తుతం నడికుడి నుంచి కనిగిరి వరకు రైల్వే లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలో ఇంకా పనులు చేపట్టాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, ఈ ఏడాది నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తే ఈ మార్గంలో కొత్త రైలు సర్వీసులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది.

అయితే మొత్తం రైల్వే మార్గం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా.. ప్రస్తుతం పనులు పూర్తయిన కనిగిరి వరకు అయినా రైళ్లను నడపాలని స్థానికులు కోరుతున్నారు. దీనివల్ల దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాలకు ప్రయాణించడం సులభమవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రైల్వే మార్గంలో రైళ్ల ప్రారంభంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *