సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC)కు శాశ్వత ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రూ.169 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణానికి ఈ-టెండర్లను ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్‌లోని కొత్తకుంట చెరువు సమీపంలో 4.11 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యాలయ సముదాయాన్ని నిర్మించనున్నారు.

ఆధునిక హంగులతో నిర్మించనున్న ఈ భవన సముదాయంలో జీ+6, జీ+8 అంతస్తులతో రెండు ట్విన్‌ టవర్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 2,41,540 చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో ప్రాజెక్టును రూపొందించారు. ప్రజలకు అవసరమైన అన్ని పౌర సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దనున్నారు.

ఈ భవనంలో ప్రజావాణి విభాగం, కౌన్సిల్‌ హాల్‌, పౌర సేవా కేంద్రాలు, ఆధునిక కమాండ్‌ సెంటర్‌ వంటి కీలక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణహిత నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ నెట్‌ జీరో గ్రీన్‌ బిల్డింగ్‌ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

హైదరాబాద్‌ నగరానికి మరో ఐకానిక్‌ భవనం చేరనుంది. నగర పశ్చిమ ప్రాంతంలో వేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్‌కు అత్యాధునిక పరిపాలనా కేంద్రాన్ని నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC) శాశ్వత ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్‌లోని కొత్తకుంట చెరువు సమీపంలో 4.11 ఎకరాల విస్తీర్ణంలో ఈ ట్విన్‌ టవర్‌ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.169 కోట్ల అంచనా వ్యయాన్ని కేటాయించింది.

నిర్మాణం పూర్తయితే సైబరాబాద్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న పరిపాలనా కార్యకలాపాలన్నీ ఒకే ప్రాంగణం నుంచి నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. ప్రజలకు పౌర సేవలు మరింత సులభంగా అందించడంతోపాటు, వివిధ విభాగాల మధ్య సమన్వయం మెరుగుపడనుంది.

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC) ప్రతిపాదించిన ఈ కార్యాలయ సముదాయం అత్యాధునిక సాంకేతికతతో పాటు పర్యావరణహిత నిర్మాణ ప్రమాణాలతో రూపుదిద్దుకోనుంది. నెట్‌ జీరో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌తో రెండు అనుసంధానమైన ట్విన్‌ టవర్లను నిర్మించనున్నారు. వీటి మొత్తం నిర్మిత విస్తీర్ణం 2,41,540 చదరపు అడుగులుగా ఉండనుంది. ఇందులో ఒక టవర్‌ను గ్రౌండ్‌ ప్లస్‌ ఆరు అంతస్తులతో, మరో టవర్‌ను గ్రౌండ్‌ ప్లస్‌ ఎనిమిది అంతస్తులతో నిర్మించనున్నారు. ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్తులో పెరిగే సిబ్బంది, పరిపాలనా విభాగాలు, పౌర సేవలను దృష్టిలో పెట్టుకుని భవనాలను రూపొందించనున్నారు.

ఈ కార్యాలయ సముదాయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. కార్పొరేషన్‌ పాలకమండలి సమావేశాల కోసం ప్రత్యేక కౌన్సిల్‌ హాల్‌, ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు ప్రజావాణి హాల్‌, పౌర సేవల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, వివిధ ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు, అనుబంధ సంస్థలకు అవసరమైన స్థలాన్ని కేటాయించనున్నారు.

ఈ భవన సముదాయం అందుబాటులోకి వస్తే పౌరులు వివిధ సేవల కోసం వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది. ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారంపై పర్యవేక్షణ, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం మరింత వేగంగా, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంటుంది.

కొత్త కార్యాలయ సముదాయంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నారు. ఇందులో భాగంగా పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్‌ ఆదా చేసే సదుపాయాలు, నీటి పొదుపు వ్యవస్థలు, మురుగునీటి శుద్ధి, శుద్ధి చేసిన నీటిని తిరిగి వినియోగించే ఏర్పాట్లు చేయనున్నారు. విద్యుత్‌, నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు స్మార్ట్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా భవన నిర్మాణాన్ని చేపట్టి సహజ వెలుతురు, గాలి ప్రసరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తద్వారా కృత్రిమ విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించి నెట్‌ జీరో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.

మరోవైపు సైబరాబాద్‌ పరిధిలో ఐటీ సంస్థలు, వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాలు వేగంగా విస్తరిస్తుండటంతో మున్సిపల్‌ సేవలకు డిమాండ్‌ పెరుగుతోంది. రహదారుల నిర్వహణ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్నుల వసూళ్లు వంటి కీలక సేవలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఆధునిక పరిపాలనా కేంద్రం అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎంసీ కొత్త ప్రధాన కార్యాలయం కీలక పాత్ర పోషించనుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర టెండర్‌ వివరాలను తెలంగాణ ప్రభుత్వ ఈ-టెండర్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్లు కార్పొరేషన్‌ వెల్లడించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయి నిర్మాణ పనులు ప్రారంభమైతే ప్రాజెక్టు అమలుపై మరింత స్పష్టత రానుంది. భవన నిర్మాణం పూర్తయితే సైబరాబాద్‌ పరిపాలనకు ఆధునిక చిరునామాగా ఈ ట్విన్‌ టవర్లు నిలవనున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *