
హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ పొందిన క్యాబ్‌లు, వాణిజ్య వాహనాల వినియోగం పెరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వాహనాలు తెలంగాణలో ఎక్కువ కాలం తిరుగుతున్నప్పటికీ స్థానికంగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
2021–22 కాగ్ నివేదిక ప్రకారం.. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన 6,376 వాహనాలు 12 నెలలకు పైగా తెలంగాణలోనే తిరిగినప్పటికీ రాష్ట్ర రిజిస్ట్రేషన్ పొందలేదు. దీంతో రీ-అసైన్‌మెంట్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన సుమారు రూ.72.51 లక్షల ఆదాయం కోల్పోయినట్లు అంచనా వేశారు.
మరోవైపు ఇతర రాష్ట్రాల వాహనాల వినియోగం పెరగడం వల్ల స్థానిక క్యాబ్ డ్రైవర్లు, వాహన యజమానులకు పోటీ పెరుగుతోందని గిగ్ వర్కర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించే వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అటు క్యాబ్ సేవలను క్రమబద్ధీకరించి డ్రైవర్లు, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేలా అగ్రిగేటర్ పాలసీ అమలుపైనా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ పొందిన వాణిజ్య వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటం రవాణా శాఖకు కొత్త సవాలుగా మారుతోంది. ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత క్యాబ్ సేవలతో పాటు ఐటీ సంస్థల ఉద్యోగుల రవాణా అవసరాల కోసం కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు పెద్ద సంఖ్యలో నగరంలో తిరుగుతున్నాయి.
దీంతో ఆయా వాహనాల రిజిస్ట్రేషన్, రవాణా అనుమతులు, పన్నుల చెల్లింపులు, బీమా నిబంధనల అమలుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు తెలంగాణలో ఎంతకాలం తిరగవచ్చు? స్థానికంగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన నిబంధనలు పాటిస్తున్నాయా? అనే అంశాలు చర్చకు వస్తున్నాయి.
మరోవైపు తెలంగాణలోనే వాహనాలు కొనుగోలు చేసి, స్థానికంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని క్యాబ్ సేవలు అందిస్తున్న డ్రైవర్లు, వాహన యజమానులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల వాహనాల వినియోగంపై నిబంధనలను కఠినంగా అమలు చేయాలని వారు కోరుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు తెలంగాణలో దీర్ఘకాలంగా తిరుగుతున్న అంశాన్ని కాగ్ తన నివేదికలో తప్పుబట్టింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ రంగ ఆడిట్ నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. మొత్తం 6,376 ఇతర రాష్ట్రాల వాహనాలు 12 నెలలకు పైగా తెలంగాణలో తిరుగుతున్నప్పటికీ ఇక్కడి రిజిస్ట్రేషన్ పొందలేదని గుర్తించింది. వీటి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రీ-అసైన్‌మెంట్ ఫీజుల రూపంలో రూ.72.51 లక్షల ఆదాయం కోల్పోయినట్లు అంచనా వేసింది.
రవాణా శాఖకు చెందిన సాఫ్ట్‌వేర్‌లో ఇతర రాష్ట్రాల వాహనాలు తెలంగాణలో 12 నెలలకు మించి కొనసాగుతున్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసే హెచ్చరికల వ్యవస్థ లేకపోవడమే ఈ ఆదాయ నష్టానికి ప్రధాన కారణమని కాగ్ నివేదిక పేర్కొంది.
అగ్రిగేటర్లకు గతంలోనే ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలు
హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్న క్యాబ్‌ల వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు గతంలోనే స్పందించారు. 2023 మే 23న క్యాబ్ ఆపరేటర్లు, డ్రైవర్ల సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలకు పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలను నగరంలో క్యాబ్ సేవలకు ఉపయోగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, వారి వ్యక్తిగత వివరాలను అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండేలా భద్రపరచాలని ఆదేశించారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. క్యాబ్ సేవల్లో పాల్గొనే వాహనాలు, వాటిని నడిపే డ్రైవర్ల వివరాల విషయంలో అగ్రిగేటర్ సంస్థలదే బాధ్యత అని ట్రాఫిక్ పోలీసులు తేల్చిచెప్పారు.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ కూడా ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌తో హైదరాబాద్‌లో తిరుగుతున్న క్యాబ్‌ల అంశాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇలాంటి వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించే వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
ఈ క్రమంలో 2026 అక్టోబరులో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్‌కు యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌తో తెలంగాణలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాహనాలపై సమగ్రంగా విచారణ జరపాలని కోరారు. అంతేకాకుండా, ప్రైవేటు వినియోగం కోసం రిజిస్ట్రేషన్ చేసిన వైట్ బోర్డు వాహనాలను ప్రయాణికుల రవాణాకు వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపైనా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
వాణిజ్య ప్రయాణికుల రవాణాకు ఉపయోగించే ప్రతి వాహనానికి తగిన రిజిస్ట్రేషన్, పర్మిట్లు, పన్నుల చెల్లింపు, చెల్లుబాటయ్యే బీమా తప్పనిసరిగా ఉండాలని యూనియన్ స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనలను పాటించకుండా క్యాబ్ సేవలు అందించే వాహనాల వల్ల అన్ని అనుమతులతో చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్న స్థానిక డ్రైవర్లు, వాహన యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మరోవైపు యాప్ ఆధారిత రవాణా సేవలను నియంత్రించి, మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీ రూపకల్పనపై దృష్టి సారించింది. ఈ విధానం అమల్లోకి వస్తే ఓలా, ఉబర్, రాపిడో వంటి సంస్థల కార్యకలాపాలకు స్పష్టమైన నిబంధనలు, మార్గదర్శకాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ పాలసీలో వాహనాల ఫిట్‌నెస్, రవాణా అనుమతులు, బీమా, అగ్రిగేటర్ సంస్థలకు లైసెన్సుల జారీ, ప్రయాణికుల భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే డిజిటల్ పర్యవేక్షణ, క్యాబ్ ఛార్జీల్లో పారదర్శకతకు సంబంధించిన నిబంధనలను కూడా రూపొందించనున్నారు. యాప్‌ల ద్వారా ప్రయాణికులను తరలించే ప్రతి వాహనం తప్పనిసరిగా చట్టబద్ధమైన అనుమతులతోనే కార్యకలాపాలు నిర్వహించేలా పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొత్త పాలసీ అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ పొందిన వాహనాల వినియోగంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో నిబంధనల ప్రకారం క్యాబ్ సేవలు అందిస్తున్న తెలంగాణ వాహన యజమానులు, స్థానిక డ్రైవర్లకు సమానమైన పోటీ వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు.




