
తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ క్రీడా పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఎల్బీ స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహించనుండగా.. గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు కార్యక్రమం జరగనుంది.
ఈసారి పోటీల్లో తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ అయిన కర్రసామును ప్రదర్శన క్రీడగా ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ క్రీడలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు క్రీడల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో ఎక్కడా నాణ్యత తగ్గకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మొత్తం 27 క్రీడాంశాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన 1,334 మంది క్రీడాకారులకు ప్రస్తుతం శిక్షణ అందిస్తున్నారు. రాష్ట్ర క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనతో పతకాలు సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది.
తెలంగాణలో తొలిసారిగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఈ క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సంస్థలో మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ కర్రసాముకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. కర్రసాముకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఎల్బీ స్టేడియంలో ప్రారంభ వేడుకలు.. గచ్చిబౌలిలో ముగింపు
డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలు జరగనున్నాయి. యువతలో క్రీడల పట్ల ఆసక్తిని మరింత పెంచేలా ప్రారంభోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నగరమంతా క్రీడా సందడి కనిపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రారంభ, ముగింపు వేడుకల నిర్వహణతో పాటు పర్యవేక్షణ బాధ్యతలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణలో సమన్వయం, పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. తమకు కేటాయించిన జిల్లాల్లో క్రీడా పోటీలు, స్టేడియాల ఏర్పాట్లు, క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను మంత్రులు పర్యవేక్షించనున్నారు.
- హైదరాబాద్: పొన్నం ప్రభాకర్
- రంగారెడ్డి: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- మహబూబ్‌నగర్: జూపల్లి కృష్ణారావు
- వరంగల్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- కరీంనగర్: అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
- ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు
- నిజామాబాద్: ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌రెడ్డి
జాతీయ క్రీడా వేదికపై తెలంగాణ కర్రసాము
ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణకు చెందిన సంప్రదాయ యుద్ధకళ కర్రసామును ప్రదర్శన క్రీడగా ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర సంప్రదాయ క్రీడలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు యువతలో వాటిపై ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కర్రసాముకు జాతీయ స్థాయి క్రీడా వేదికపై అవకాశం కల్పించడం ద్వారా ఈ సంప్రదాయ కళకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కర్రసాముకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. కర్రసాము ప్రదర్శన విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు
క్రీడా పోటీల కోసం ఎంపిక చేసిన స్టేడియాల పునరుద్ధరణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం, రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పనుల పురోగతిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
ఈ నెలాఖరులోగా స్టేడియాల అభివృద్ధి పనులతో పాటు 27 క్రీడాంశాలకు అవసరమైన క్రీడా పరికరాల ఏర్పాటు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 20 స్టేడియాల్లో అభివృద్ధి పనులు చేపట్టగా.. ఇప్పటికే 14 స్టేడియాల్లో పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఆరు స్టేడియాల్లోనూ ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.
క్రీడాకారులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా అత్యుత్తమ కోచ్‌లతో శిక్షణ ఇప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
1,334 మంది క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ తరఫున పాల్గొనే క్రీడాకారుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 27 క్రీడాంశాల్లో 1,334 మంది రాష్ట్ర క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.
ఇక పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్న 861 మంది క్రీడాకారులు, కోచ్‌లకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు పోటీలకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలా శిక్షణ, వసతి, పరికరాల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయనుంది. ఈ పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.203 కోట్లు వెచ్చించనుండగా.. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21 కోట్లు కేటాయించింది. స్టేడియాలను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంతో పాటు అత్యాధునిక క్రీడా పరికరాలను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చు చేస్తోంది.
కేవలం ఖేలో ఇండియా పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా.. భవిష్యత్తులోనూ క్రీడాకారులకు ఉపయోగపడేలా స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మౌలిక సదుపాయాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.
తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ రాష్ట్ర క్రీడారంగ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.




