
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎనిమిది మండలాల పరిధిలోని 135 గ్రామ పంచాయతీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 76.6 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని మొత్తం 3,27,791 మంది ఓటర్లకు గాను 2,51,077 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు 29.7 శాతం, 11 గంటలకు 58.6 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సంఖ్య 76.6 శాతానికి చేరింది. మొత్తం 1,303 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.
మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే చిప్పగిరి మండలం 79.8 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. దేవనకొండలో 79.3 శాతం, ఆస్పరిలో 77.7 శాతం, ఆదోని-2లో 77.4 శాతం, ఆదోని-1లో 75.7 శాతం, ఆలూరులో 75.6 శాతం, హాలహర్విలో 73.3 శాతం, హొళగుండలో 73.1 శాతం పోలింగ్ నమోదైంది.
వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
జిల్లాలో జరుగుతున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి కలెక్టరేట్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పరిస్థితులు, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణను ఆమె పరిశీలించారు.
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు.




