
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మరోసారి భారీ కానుక అందింది. చెన్నైకి చెందిన ప్రముఖ దాత వర్థమాన్ జైన్ దంపతులు శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ స్వర్ణాభరణాలను టీటీడీకి అందజేశారు.
దాదాపు రూ.207.6 కోట్ల విలువైన ఈ కానుకలో మొత్తం 46 రకాల ప్రత్యేక బంగారు ఆభరణాలు ఉన్నాయి. శ్రీవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా వీటిని తయారు చేయించారు. ఇందులో 106 కిలోల బంగారంతో రూపొందించిన ఆభరణాలను స్వామివారికి సమర్పించారు.
అంతేకాకుండా శ్రీ పద్మావతీ అమ్మవారికి కూడా వర్థమాన్ జైన్ దంపతులు ప్రత్యేక కానుక అందించారు. 15 కిలోల బరువైన బంగారు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించారు.
శ్రీవారి పట్ల తమకున్న అపారమైన భక్తిని చాటుకుంటూ ఇంతటి విలువైన ఆభరణాలను కానుకగా అందించడం విశేషంగా నిలిచింది. సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


46 రకాల స్వర్ణ ఆభరణాలు ఇవే..
- బంగారు పాద కవచములు -3
- బంగారు అందెలు -3
- బంగారు పాకడాలు
- బంగారు తులసిపాత్ర హారం
- బంగారు అష్టోత్తర కాసుల మాల
- బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం
- బంగారు పులిగోరు
- బంగారు అశ్వథ పాత్ర హారము
- బంగారు సాదా వడ్డాణము
- బంగారు గంటల మొలతాడు
- బంగారు సూర్యకటారి
- బంగారు కౌస్తుభం
- బంగారు శ్రీవత్సం
- బంగారు మోచేయి
- బంగారు కటి హస్తం
- బంగారు నాగాభరణ వడ్డాణము
- బంగారు గోపు
- బంగారు ఐదు పేటల కంఠీలు 5
- బంగారు చంద్రవంకీ కంఠీ
- బంగారు వైకుంఠ హస్తం
- బంగారు నాగాభరణ కడియాలు 4
- బంగారు భుజ కీర్తులు 3
- బంగారు కర్ణపత్రములు 3
- బంగారు భావళీలు -3
- బంగారు సాలిగ్రామ హారములు- 3
- బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3
- బంగారు మోపుగల యజ్ఞోపవీతం
- బంగారు శంఖ కవచము
- బంగారు చక్ర కవచము
- బంగారు కిటీపు ముఖపట్టి
- బంగారు కిరీటము
- 2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం
- 238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు






