ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి సొంత మండలమైన పొదలకూరులో పలువురు ముఖ్య అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఊకోటి లక్ష్మీనారాయణ, సన్నికంటి శ్రీనివాసులతో పాటు సుమారు 150 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి.

ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికలతో పొదలకూరు మండలంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అందుకే టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

మరోవైపు 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీకి సవాలుగా మారాయి. గత ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన కొందరు నేతలతో పాటు క్షేత్రస్థాయి నాయకులు కార్యకర్తలు సైతం పార్టీని వీడుతున్నారు. తాజాగా పొదలకూరులో 150 కుటుంబాలు టీడీపీలో చేరడం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *