
మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే.. నవ్యాంధ్రలో స్వర్ణయుగం సాకారం అవుతుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. కర్నూలు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన బుధవారం రాత్రి ఆదోని నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీడీిపీకి కార్యకర్తలే అధినేతలు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. క్రమశిక్షణతో బాధ్యతగా పని చేయండి. మేమే వెతుక్కుంటూ వచ్చి పదవులు ఇస్తాం.’’ అని అన్నారు. టీడీపీ శాశ్వతమని, ఈ విషయాన్ని ప్రతి కార్యకర్తా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ‘‘2019-24 మధ్య ఎన్నో కష్టాలు పడ్డారు.
ప్రాణాలకు తెగించి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మీ కష్టాన్ని మరువలేం. రాష్ట్రంలో మరో మూడు పర్యాయాలు అధికారం చేపట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చవచ్చు. టీడీపీ చేపట్టిన ఇంటింటి కార్యక్రమానికి బూత్ స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి వరకు నాయకులు ప్రజల వద్దకు వెళ్లాలి. మనం చేసిన మంచి పనులు వివరించాలి. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ను ‘మై టీడీపీ యాప్’లో అప్లోడ్ చేయాలి.
కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ. గతంలో మీపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్కొక్కటిగా తీసేస్తున్నాం. సమస్యలు ఉంటే నాయకుల దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తారు. త్వరలోనే ప్రతి కార్యకర్తకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తాం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, విధ్వంసం చేసి వెళ్లింది. అలాంటి రాష్ట్రాన్ని చక్కదిద్దుతూనే.. మరో వైపు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. ప్రధాని మోదీ సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తున్నాం.’’ అని అన్నారు.

