
భోగాపురం విమానాశ్రయం త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. తొలి దశలోనే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే వీలుంది. ఏడాదికి 25 వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం ఉన్న కార్గో టెర్మినల్‌ను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయం కోసం ప్రభుత్వం 2703 ఎకరాల భూమిని సేకరించింది. అయితే చంద్రబాబు నాయుడు ఏకంగా 15 వేల ఎకరాల భూమి సేకరించాలని భావించారు.
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల కోసం కూడా 5500 ఎకరాలకు మించి భూమిని సేకరించలేదు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం 5500 ఎకరాలను సేకరించడమే ఇప్పటి వరకూ గరిష్టం. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం కోసం 5106 ఎకరాలు, బెంగళూర్ ఎయిర్‌పోర్ట్ కోసం 4000 ఎకరాలు సేకరించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం సేకరించిన భూమికి దాదాపు మూడు రెట్ల భూమిని భోగాపురంలో సేకరించాలని చంద్రబాబు ఎందుకు అనుకున్నారు? ఆయన ప్లాన్ ఏంటి? అనేది చూద్దాం.
భోగాపురంలో విమానాలు రాకపోకలు సాగించే ఓ విమానాశ్రయం నిర్మించడం మాత్రమే కాదు.. ఇంటిగ్రేటెడ్ ఏరోసిటీని నిర్మించాలనేది చంద్రబాబు అసలు ప్లాన్. విమానాల రిపేర్లు, సర్వీసింగ్ సెంటర్లతోపాటు.. పైలట్లు, ఇతర విమాన సిబ్బందికి శిక్షణ ఇచ్చే అకాడమీలను ఇక్కడ ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావించారు. అలాగే విమాన విడిభాగాల తయారీ, రక్షణ రంగ పరిశ్రమలు నెలకొల్పాలని అనుకున్నారు.

