
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 పురుషుల జావెలెన్ త్రో ఫైనల్లో శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల యంగ్ అథ్లెట్ రుమేష్ తారంగ పతిరగె సంచలనం సృష్టించాడు. ఏకంగా 89.75 మీటర్ల దూరం జావెలిన్ విసిరి, ఒలింపిక్ ఛాంపియన్లు నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్‌లను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చిన్నతనంలో క్రికెట్ ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన రుమేష్, తండ్రి ప్రోత్సాహంతో జావెలెన్ త్రో వైపు మళ్లి ఈ స్థాయికి ఎదిగాడు. జావెలెన్ త్రోలో నీరజ్ చోప్రాకు ప్రధాన పోటీదారుగా మారాడు.
వాస్తవానికి 2026 సీజన్ ప్రారంభం నుంచే రుమేష్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పర్త్ ట్రాక్ క్లాసిక్ గెలవడంతో పాటు, మార్చిలో 89.37 మీటర్లతో జాతీయ రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత కెన్యాలోని కిప్ కేనో క్లాసిక్ గెలిచిన అతడు, రోమ్ డైమండ్ లీగ్‌లో ఏకంగా 92.62 మీటర్ల కళ్ళు చెదిరే త్రో విసిరి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్లో 90 మీటర్ల మార్కును దాటిన ఏకైక అథ్లెట్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్, దోహా డైమండ్ లీగ్‌లలో కూడా విజయం సాధించి గ్లాస్గోలో అడుగుపెట్టాడు.
అయితే కెరీర్ ప్రారంభం నుంచి రుమేష్.. జావెలిన్ త్రోయర్ కాదు. రుమేష్, కాలేజీలో చదువుతున్న రోజుల్లో క్రికెట్లో ఫాస్ట్ బౌలర్‌గా మంచి వేగంతో బంతులు విసిరేవాడు. సుమారు 130 కి.మీ వేగంతో బ్యాటర్లకు బంతులు సంధించేవాడు. కానీ స్వతహాగా డిస్కస్ త్రోయర్ అయిన తన తండ్రి ప్రోత్సాహంతో 2017లో జావెలెన్ పట్టాడు. ఆ నిర్ణయం అతడి జీవితాన్ని మార్చివేసింది. 2022 ప్రపంచ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో 7వ స్థానంలో నిలిచిన రుమేష్, ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌లో మైక్, కేల్సీ బార్బర్ అనే ప్రముఖ కోచ్‌ల శిక్షణలో తనను తాను మెరుగుపరుచుకున్నాడు. నిలకడగా 88 మీటర్లకు పైగా ఈటెను విసరడాన్ని అలవాటుగా చేసుకున్నాడు.
ఇక గత కొన్నేళ్లుగా ఆసియాలో జావెలిన్ త్రోయర్లు అంటే.. నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్‌ల పేరే వినిపించేది. కానీ గ్లాస్గో విజయంతో రుమేష్.. ఆ కాంబినేషన్‌ను త్రిముఖ పోరుగా మార్చేశాడు. ఈ సీజన్ బెస్ట్ త్రో (92.62 మీటర్లు), కామన్వెల్త్ గోల్డ్ మెడల్‌తో ఉన్న రుమేష్, రాబోయే ఆసియా గేమ్స్‌లో నీరజ్ చోప్రాకు అతిపెద్ద సవాల్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న కుర్రాడు, ఇప్పుడు ప్రపంచ జావెలెన్ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు.

