
ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక వైద్య సేవలను మరింత విస్తరించే దిశగా రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రులను మంజూరు చేయాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి వైద్య సంస్థగా తీర్చిదిద్దాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పీ. నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు. దాదాపు ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉన్న ఒక్క ఎయిమ్స్ మాత్రమే సరిపోవడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కావాలంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కో ఎయిమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వివరించారు. గతంలో జమ్మూ కశ్మీర్, బిహార్ వంటి రాష్ట్రాలకు ఒకటికి పైగా ఎయిమ్స్ సంస్థలను కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కూ మరో రెండు ఎయిమ్స్‌లను కేటాయించాలని కోరారు. దీంతో ప్రాంతీయ అసమానతలు తగ్గడంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు రాష్ట్రవ్యాప్తంగా మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.
**అలాగే ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్‌ను అన్ని విభాగాల్లో మరింత బలోపేతం చేయాలని లింగమనేని రమేశ్ సూచించారు. ముఖ్యంగా క్యాన్సర్, న్యూరోసైన్సెస్, అవయవ మార్పిడి (ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్), అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను విస్తరించాలని కోరారు. ఇందుకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు, అదనపు పడకలు, వైద్యులు, సిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించాలంటే మంగళగిరి ఎయిమ్స్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కొత్త ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు ఎయిమ్స్‌లను మంజూరు చేయాలని ఎంపీ కోరారు.

