
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు సుమారు 56 లక్షల మంది ఓటర్లను తొలగింపు కోసం గుర్తించగా.. మరో 19 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు ఇంకా డిజిటైజేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నాయి. పూర్తిగా ఇతర ప్రాంతాలకు మారినవారు.. చనిపోయినవారు, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు, గుర్తించలేని ఓటర్లు.. ఈ తొలగింపు జాబితాలో ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్ట్ 10లోపు పెండింగ్ ఫారాల పరిశీలన పూర్తి అయిన తర్వాత లెక్క తేలుతుందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) శరవేగంగా కొనసాగుతోంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు సుమారు 56 లక్షల మంది ఓటర్లను తొలగింపు కోసం గుర్తించారు. రాష్ట్రంలోని మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో ఇది సుమారు 16.5 శాతం కావడం గమనార్హం. అయితే ఈ లెక్కలు ఇంకా ఫైనల్ కావని.. మిగిలిన 19 లక్షల ఫారాల పరిశీలన పూర్తి అయిన తర్వాత ఇందులో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం దాదాపు 19 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు ఇంకా డిజిటైజేషన్‌కు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి మొత్తం ఓటర్లలో సుమారు 5.6 శాతం కావడం గమనార్హం. ఈ ఫారాల డేటా నమోదు ప్రక్రియ ఆగస్ట్ 10వ తేదీ లోపు పూర్తికానుందని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ ఓటర్ల వివరాలను పరిశీలించి వారు ఉంటుందో లేక తొలగింపు జాబితాలో చేర్చాలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అందువల్ల తొలగింపు జాబితాలో ఉన్న వారి సంఖ్య ఇంకా పెరగవచ్చని లేదా తగ్గవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి తొలగింపు కోసం గుర్తించిన ఓటర్లలో అత్యధికంగా.. గతంలో ఉన్న ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిపోయిన ఓటర్లే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇలా మారిన వారి సంఖ్య సుమారు 34.2 లక్షలు ఉంటుందని.. అంటే రాష్ట్ర మొత్తం ఓటర్లలో సుమారు 10.1 శాతమని తెలుస్తోంది. అదే సమయంలో 8.9 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు గుర్తించారు. మరో 6.3 లక్షల మంది వారు నమోదు చేసిన అడ్రస్‌లలో లేనివారు లేదా గుర్తించలేని వారిగా నమోదు చేశారు. మిగిలిన 6.2 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు లేదా ఇప్పటికే వేరే ప్రాంతంలో నమోదు అయినవారిగా గుర్తించారు.
ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో సేకరించలేని ఎన్యుమరేషన్ ఫారాలు కూడా భారీ సంఖ్యలో ఉన్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగర పరిధిలోని పట్టణ నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఒక రిపోర్ట్ వెల్లడించింది. అదే ప్రాంతంలో డిజిటైజేషన్ కోసం ఇంకా పెండింగ్‌లో ఉన్న ఫారాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెబుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకు మొత్తం ఓటర్లలో 4 వంతులకు పైగా డిజిటైజేషన్ పూర్తి కావడం ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా సాగుతోందని అర్థం అవుతోంది.

