
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన వ్యయ వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. 2021 నుంచి ఇప్పటి వరకు ప్రధాని విదేశీ పర్యటనల కోసం మొత్తం రూ.74.5 కోట్లు ఖర్చు చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపింది. ఈ వివరాలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్, సీపీఎం ఎంపీ వి. శివదాసన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.
ఏప్రిల్ 2021 నుంచి డిసెంబర్ 2025 వరకు ప్రధానమంత్రి చేపట్టిన విదేశీ పర్యటనలు, వాటికి అయిన ఖర్చు, ఆయా పర్యటనల సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు (MoUs), అలాగే దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించింది.
ఈ కాలంలో భారత్‌కు 381.8 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే ప్రధానమంత్రి విదేశీ పర్యటనల ద్వారా సాంకేతికత, ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం తదితర కీలక రంగాల్లో అనేక ఒప్పందాలు కుదిరాయని పేర్కొంది. ఈ పర్యటనలతో వివిధ దేశాలతో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక, దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

