
జల్సాలు, గుర్రపు పందేలాకు అలవాటు పడిన ఓ వ్యక్తి బ్యాంకుకే కన్నం వేసి కటకటాల పాలయ్యాడు.
జల్సాలు, గుర్రపు పందేలకు అలవాటు పడిన ఓ వ్యక్తి నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకును మోసం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మడకశిరలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడకశిరలోని కెనరా బ్యాంకులో సుందరేష్ ఆచారి అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అతడు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 872 గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రూ.70.66 లక్షలు రుణంగా తీసుకున్నాడు.
జూలై 24న బ్యాంకు అధికారులు నిర్వహించిన తనిఖీల్లో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితుడు సుందరేష్ను వైబీహళ్లి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో సుందరేష్ బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో పరిచయాలు పెంచుకుని, మాయమాటలతో వారి పేర్లపై నకిలీ బంగారు రుణ ఖాతాలను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా వచ్చిన డబ్బును బెంగళూరుకు తీసుకెళ్లి జల్సాలకు, గుర్రపు పందేలకు ఖర్చు చేసేవాడని వెల్లడైంది.
నిందితుడి నుంచి రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మోసంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

