
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పేరుతో వైసీపీ అరాచకానికి పాల్పడుతోందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పరిస్థితులు శృతిమించుతున్నాయని మండిపడ్డారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ వైసీపీ నేతలు చర్చకు రావడానికి ముందుకు రావడం లేదని విమర్శించారు.
బ్రిడ్జ్ గేమ్ కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమని, దాన్ని పేకాటతో పోల్చుతూ వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బోండా ఉమా అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై పేపర్ రూపంలో లిఖితపూర్వక వివరణ ఇచ్చిందని తెలిపారు.
డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు గత ఎనిమిది నెలలుగా విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు వారిని ఇబ్బందులకు గురిచేసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో యువత భవిష్యత్తుతో ఆటలాడుకున్నారని విమర్శించారు. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలకు అధికారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.
మెగా డీఎస్సీ నిర్వహించకుండా వైసీపీ 220 కేసులు దాఖలు చేసిందని బోండా ఉమా పేర్కొన్నారు. అయితే కోర్టు ఆ ఆరోపణలను ప్రాథమిక దశలోనే తిరస్కరించిందని, మెగా డీఎస్సీ ప్రక్రియ సక్రమంగానే జరిగిందని కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ప్రస్తుతం వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు.
కుల రాజకీయాలు చేయొద్దని వ్యాఖ్యలు
ముత్యాలంపాడులో రౌడీషీటర్లను తీసుకొచ్చి గొడవలకు కారణమయ్యారని బోండా ఉమా ఆరోపించారు. వెల్లంపల్లి, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు కులం అంశాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బ్రాహ్మణ కులం పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని సూచించారు.
మల్లాది విష్ణుపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ఆయన వ్యవహారశైలి ఆ కులానికి చెడ్డ పేరు తీసుకొస్తోందని వ్యాఖ్యానించారు. వెల్లంపల్లి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
దేవినేని అవినాష్‌పైనా బోండా ఉమా తీవ్రస్థాయిలో స్పందించారు. తనపై అవినాష్ వ్యాఖ్యలు చేస్తే తాను కూడా గట్టిగా సమాధానం ఇస్తానని హెచ్చరించారు. అవినాష్, వెల్లంపల్లి కారణంగానే ప్రశాంతంగా ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వివాదాలు మొదలయ్యాయని ఆరోపించారు.
దాడులు చేయడం టీడీపీ సంస్కృతి కాదని బోండా ఉమా అన్నారు. గతంలో టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడులు చేసిన వైసీపీ నేతలే ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని విమర్శించారు. మాచర్ల, గుడివాడ ప్రాంతాల్లో తనపై దాడులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ నేతలు హద్దులు దాటకుండా వ్యవహరించాలని సూచించారు.
ధర్నాలపై బోండా ఉమా వ్యాఖ్యలు
ధర్నా చౌక్ ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో ఆందోళనలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం సరైన విధానం కాదని బోండా ఉమా అన్నారు. అవసరమైతే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యేకంగా ధర్నా చౌక్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధి పరంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో ఉందని తెలిపారు.
పేర్ని నాని రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని బోండా ఉమా సూచించారు. బియ్యం కేసు వ్యవహారంలో ఆయన తీరు బయటపడిందని ఆరోపిస్తూ.. ఓ టీడీపీ నాయకుడి సహకారంతో కేసు నుంచి బయటపడ్డారని, డబ్బులు చెల్లించి సమస్యను పరిష్కరించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై విమర్శలు కొనసాగితే బందరు వెళ్లి సమాధానం చెబుతానని హెచ్చరించారు.
అయితే వైసీపీ శాంతియుతంగా నిరసనలు చేపడితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని బోండా ఉమా స్పష్టం చేశారు. అయితే హద్దులు దాటి వ్యవహరిస్తే తమదైన శైలిలో స్పందిస్తామని అన్నారు. తనకు టీడీపీ టికెట్ లేదని మల్లాది, వెల్లంపల్లి, అవినాష్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపైనా బోండా ఉమా విమర్శలు చేశారు. తాను ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో అంబటి రాంబాబు వచ్చి తన పక్కన కూర్చున్నారని చెప్పారు. ఈ సందర్భంగా అంబటి గత రాజకీయ వ్యవహారాలపై కూడా ఆయన ఆరోపణలు చేశారు.
చివరగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో తాను ఇప్పటికే చర్చించినట్లు బోండా ఉమా తెలిపారు.

