
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో మరోసారి మాజీ మంత్రి బాలినేని, ఎమ్మెల్యే దామచర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తనను, తన అనుచరులను టార్గెట్ చేస్తున్నారంటూ బాలినేని ఆరోపిస్తే.. అసలు బాలినేని చేసిన దానికి జనసేనలో లేకుంటే ఎప్పుడో జైలుకు వెళ్లేవారని దామచర్ల అన్నారు. కూటమిలో ఉన్నారనే మౌనంగా ఉంటున్నానని దామచర్ల అంటే.. ఎమ్మెల్యే అయితే ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ బాలినేని హెచ్చరించారు. మొత్తానికి బాలినేని వర్సెస్ దామచర్ల వ్యవహారంతో ఒంగోలు మరోసారి హీటెక్కింది.
ఒంగోలులో కూటమి నేతలు మరోసారి రచ్చకెక్కారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ – మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాటల యుద్ధంతో మరోసారి ఒంగోలు హీటెక్కింది. బాలినేని వర్సెస్ దామచర్ల ఎపిసోడ్‌కు బ్రేక్ పడింది అని అందరూ అనుకున్నా.. తాజాగా ఒకరిపై మరొకరు వార్నింగ్‌లు ఇచ్చుకోవడంతో కూటమిలో కుమ్ములాట మరోసారి బహిర్గతమైంది. జనసేనలో చేరకుంటే బాలినేని ఎప్పుడో జైలుకు వెళ్లేవారని జనార్దన్ అంటే.. ఎమ్మెల్యే అయితే ఎవ్వర్నీ వదిలిపెట్టనంటూ బాలినేని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
బాలినేని చేసిన తప్పుల్ని ముద్రిస్తే పుస్తకాలే సరిపోవని దామచర్ల జనార్దన్ అంటే.. దామచర్ల చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయించాలంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో చేసినట్లు రౌడీయిజం చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరని బాలినేని టార్గెట్‌గా దామచర్ల వ్యాఖ్యలు చేశారు. అయితే, తన వర్గం మనుషులను టార్గెట్ చేసి అరెస్టు చేయిస్తున్నారంటూ బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశం పెట్టి మరీ ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు
“బాలినేని చేసిన తప్పులు ముద్రిస్తే కరపత్రాలే కాదు.. పుస్తకాలూ సరిపోవు. అమావాస్య, పౌర్ణమికి ఓసారి ఒంగోలు వస్తారు. నాపై వ్యక్తిగతం ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు. కూటమిలో ఉన్నారని మౌనంగా ఉన్నా.. జనసేనలోకి వెళ్లకుండా ఉంటే అతను చేసిన పాపాలకు జైలుకు వెళ్లేవారు. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి విద్యార్థులకు గంజాయి అలవాటు చేశారు. ఒంగోలులోనే ఉండాలని వెయ్యి సార్లు చెప్పా. గత ప్రభుత్వం బారు షాపులు సిండికేట్ చేసి బాలినేని, ఆయన కుమారుడు కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ అక్రమాలపై కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు వస్తా, మీరు వస్తారా?” అంటూ దామచర్ల జనార్దన్ సవాల్ విసిరారు.

