
హోం మంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేట ఇప్పటి వరకు మేజర్ పంచాయతీగానే ఉంది. 2021లో మున్సిపాలిటీ చేసే అవకాశం వచ్చినా స్థానిక కారణాలతో చేయకుండా వదిలేశారు. అయితే, తాజాగా జనాభా లెక్కల ప్రకారం పాయకరావుపేట జనాభా 40 వేలు ఉంది. 30 వేలు జనాభా ఉంటే మున్సిపాలిటీకి అవకాశం. దాంతో ఈసారి ఎలాగైనా పాయకరావుపేటను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత గట్టి పట్టుదలతో ఉన్నారు.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేట ఇప్పటి వరకు మేజర్ పంచాయతీగానే ఉంది. ఇప్పుడు దాన్ని మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. పాయకరావుపేట అభివృద్ధి కోసం హోం మంత్రి అనిత సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన నాయకులతో కూడా ఆమె సమావేశం నిర్వహించారు. పాయకరావుపేట అభివృద్ధి పథంలో పయనించాలన్నా.. భారీ గ్రాంట్లు రావాలన్నా పురపాలక సంఘంగా మార్చడమే సరైన పద్ధతని ఆమె నాయకులకు వివరించారు.
మేజర్ పంచాయతీగా ఉన్న పాయకరావుపేట మున్సిపాలిటీ మారడం సాధ్యమేనా అనే విషయాలను చర్చిస్తే.. ఒక ఊరిని మున్సిపాలిటీగా మార్చాలంటే 30 వేల జనాభా ఉంటే సరిపోతుంది. 2021లో కూడా మున్సిపాలిటీ ప్రతిపాదన వచ్చింది, కానీ అప్పట్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 27 వేల మంది మాత్రమే ఉన్నారు. దాంతో పక్కనే ఉన్న పీఎల్‌పురం, అరట్లకోట గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చాలని నిర్ణయించారు.
ప్రభుత్వం కూడా అప్పట్లో నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేటలను మున్సిపాలిటీలుగా పేర్కొంటూ జీఓ కూడా విడుదల చేసింది. అయితే, పలు రకాల కారణాలతో చోడవరం, పాయకరావుపేటలను పంచాయతీలుగానే కొనసాగించేందుకు నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణాలు ఏడాదికి రెండుసార్లు ఇంటిపన్ను కట్టాల్సి రావడం, ఉపాధి హామీ పథకం పనులు నిలిచిపోతాయనే కారణాలతో పాయకరావుపేటను మున్సిపాలిటీ చేయకుండా వదిలేశారు. అంతేగాకుండా పీఎల్‌పురం గ్రామస్థులు దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధపడటంతో పాయకరావుపేట మేజర్ పంచాయతీగానే మిగిలిపోయింది.
ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం పాయకరావుపేట మున్సిపాలిటీగా చేయడానికి సరిపోతుంది. తాజాగా జనాభా లెక్కల ప్రకారం సుమారు 40 వేల జనాభా ఉంది. దాంతో మిగతా గ్రామాలను కలుపుకోకుండానే పాయకరావుపేటను ఒక్కదానినే మున్సిపాలిటీగా చేయొచ్చు. హోం మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో నిధులకు కొరతే ఉండదు, పైగా కేంద్రం నుంచి కూడా పెద్దఎత్తున నిధులు వస్తాయి. దాంతో హోం మంత్రి అనిత స్థానిక నాయకులతో సమావేశమై పాయకరావుపేటను మున్సిపాలిటీగా చేసే పనిలో పడ్డారు.

