హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక కార్యక్రమంలో లండన్‌కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ల సహకారంతో అవసరమైన చిన్నారులకు ఆపరేషన్లు చేయనున్నారు.
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అర్హత కలిగిన చిన్నారులను వాక్-ఇన్ విధానంలో పరీక్షించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన పిల్లలకు పూర్తిగా ఉచితంగా హార్ట్ సర్జరీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది.

హైదరాబాద్, ఆగస్టు 10: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చిన్నారులకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నిమ్స్ డైరెక్టర్ ప్రొ. రాహుల్ దేవరాజ్ వెల్లడించారు.
నిమ్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం హెచ్ఓడీ ప్రొ. అమరేశ్వర్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు జరగనున్నాయి. లండన్‌కు చెందిన వైద్యులు, ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో ప్రత్యేకంగా ఈ సర్జరీలను నిర్వహించనున్నారు. చిన్నారుల గుండె సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలను అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా అధికారులు తెలిపారు.
గత ఐదేళ్లుగా ప్రతి సంవత్సరం నిమ్స్‌లో ఈ ఉచిత గుండె శస్త్రచికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి ప్రాధాన్యత కేటాయిస్తూ వాక్-ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న చిన్నారులను గుర్తించి, వారికి పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

