గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈశా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఈశా గ్రామోత్సవం రాష్ట్రస్థాయి పోటీలు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటీలో అట్టహాసంగా జరిగాయి. క్లస్టర్‌ స్థాయిలో పురుషుల వాలీబాల్‌, మహిళల త్రోబాల్‌ పోటీల్లో విజయం సాధించిన 18 జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో తలపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచి 8,800 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు.

వీరిలో 2,500 మంది మహిళా క్రీడాకారులు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు పెద్ద వేదిక కల్పించడమే ఈశా గ్రామోత్సవం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు వచ్చే నెల 6న కోయంబత్తూరులో జాతీయస్థాయి ఫైనల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ ఈశా గ్రామోత్సవ కోఆర్డినేటర్‌ స్వామి అంబర తెలిపారు. టోర్నమెంట్‌ మొత్తానికి కలిపి కోటి రూపాయల ప్రైజ్‌మనీ అందజేస్తున్నట్లు వెల్లడించారు.

పురుషుల వాలీబాల్‌ విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో కాకినాడ జట్టుపై విజయం సాధించి ఏలూరు జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. విశాఖపట్నం జట్టు తృతీయ స్థానంలో, రాజమండ్రి జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. మహిళల త్రోబాల్‌ విభాగంలో విశాఖపట్నానికి చెందిన శ్రీరామ జట్టు ప్రథమ స్థానాన్ని సాధించింది. అదే జిల్లాకు చెందిన ఆంజనేయ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.

By Rajini