
అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్‌లో పర్యటిస్తోంది. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి నారాయణతో పాటు అధికారులు ఆదివారం రాత్రి లండన్ చేరుకున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్ల వెలుపలి రూపకల్పన (ఫసాడ్)పై ఆర్కిటెక్ట్‌లు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి చర్చించనున్నారు.
ఐకానిక్ భవనాల డిజైన్లను రూపొందించిన నార్మన్ అండ్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, బ్యూరో హాపోల్డ్ కన్సల్టెన్సీ, ఎల్‌అండ్‌టీ సంస్థల ప్రతినిధులతో జరిగే సమావేశాల్లో తుది డిజైన్లపై సమీక్ష నిర్వహించనున్నారు.ముఖ్యంగా అసెంబ్లీ భవనం పైభాగంలో నిర్మించనున్న ఎత్తైన టవర్ (స్ఫియర్) డిజైన్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ టవర్ ద్వారా అమరావతి రాజధాని ప్రాంతాన్ని వీక్షించేలా పర్యాటక ఆకర్షణగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
అమరావతిలో ఇప్పటికే కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతితో పాటు, భవిష్యత్తులో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని చేపట్టే విధానం, డిజైన్ల అమలు వంటి అంశాలపై కూడా ఆర్కిటెక్ట్‌లు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి నారాయణ చర్చించనున్నారు. మంత్రి నారాయణ వెంట సీఆర్డీయే కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ అభిషేక్ కుమార్‌తో పాటు పలువురు చీఫ్ ఇంజినీర్లు లండన్ పర్యటనలో పాల్గొంటున్నారు.

