సుమారు 18 నెలలుగా మూసి ఉన్న ఇంట్లో 57 ఏళ్ల మహిళ అస్థిపంజరంగా కనిపించిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒంటరిగానే జీవించేవారని పోలీసులు తెలిపారు. అంతేకాదు, రెండేళ్లకు పైగా కుమార్తెతో కూడా ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించారు.
మృతురాలు తరచూ తీర్థయాత్రలకు వెళ్తుండటంతో.. ఆమె మరోసారి యాత్రకు వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. దీంతో ఇంటి తలుపులు మూసి ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా అనుమానం వ్యక్తం చేయలేదు. ఈ క్రమంలో సుమారు ఏడాదిన్నర పాటు ఆ ఇంటి తలుపులు తెరుచుకోలేదు.
చివరకు ఓ రోజు ఇంటి తలుపులు తెరవగా లోపల కనిపించిన దృశ్యం అందరినీ షాక్కు గురిచేసింది. ఇంట్లో 57 ఏళ్ల మహిళ అస్థిపంజరం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎప్పుడు, ఎలా మృతి చెందారనే విషయాలపై విచారణ కొనసాగుతోంది.

బెంగళూరు, ఆగస్ట్ 9: బెంగళూరులో సంచలనం సృష్టించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సుమారు 18 నెలల క్రితమే మృతి చెందినట్లు అనుమానిస్తున్న 57 ఏళ్ల మహిళ అస్థిపంజరం ఆమె నివాసంలోని బాత్రూమ్లో లభ్యమైంది. బాగలకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలోని హవనూర్ లేఅవుట్లో ఉన్న అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని దాక్షాయిణిగా పోలీసులు గుర్తించారు.
దాక్షాయిణి కుటుంబం దాదాపు 15 ఏళ్లుగా అదే డూప్లెక్స్ ఇంట్లో నివసిస్తోంది. ఆమె భర్త ఉమేశ్ వై., కుమారుడు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. దీంతో ఆమె ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. దాక్షాయిణి కుమార్తె మాత్రం బాగలకుంటె సమీపంలోనే, తల్లి ఇంటికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో నివసిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తలుపులు లోపలి నుంచే లాక్.. ఇంట్లోనే అస్థిపంజరం
ఇల్లు చాలా కాలంగా తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం రాత్రి పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా.. బాత్రూమ్లో దాక్షాయిణి అస్థిపంజరం కనిపించింది.
అయితే ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు, గొలుసు యథాతథంగా ఉన్నాయి. ఇంట్లోని వెండి వస్తువులు, ఇతర విలువైన వస్తువులు కూడా చోరీకి గురైన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో దోపిడీ లేదా హత్య కోణంలో దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానాలను పోలీసులు ప్రాథమికంగా తోసిపుచ్చారు.
మరోవైపు ఇంటి ప్రధాన గేటు, ఇంటి తలుపు, బాత్రూమ్ తలుపు సైతం లోపలి నుంచే లాక్ చేసి ఉండటం కేసులో కీలకంగా మారింది. దీంతో దాక్షాయిణి మృతి చెందిన సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉండి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అస్థిపంజరాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రెండేళ్లుగా కూతురితో మాటలు బంద్.. తీర్థయాత్రలకు వెళ్లారని భావించిన కుటుంబం
పోలీసుల వివరాల ప్రకారం దాక్షాయిణి కొంతకాలంగా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తన కుమార్తెకు దూరంగా ఉంటున్నారు. రెండేళ్లకు పైగా తల్లీకూతుళ్ల మధ్య ఎలాంటి సంబంధాలు లేకపోయినట్లు పోలీసులు తెలిపారు. దాక్షాయిణి తరచూ తీర్థయాత్రలకు వెళ్లేవారని, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలను కూడా సందర్శించేవారని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.
దీంతో ఆమె మరోసారి తీర్థయాత్రకు వెళ్లి ఉంటారని కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు భావించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంతకాలం ఇంట్లోనే ఆమె మృతదేహం ఉండటం, ప్రారంభ రోజుల్లో మృతదేహం నుంచి వెలువడే దుర్వాసనను పొరుగువారు గుర్తించకపోవడం పోలీసులకు అనుమానాలను కలిగిస్తోంది.
సాధారణంగా మృతదేహం కుళ్లిపోయే సమయంలో వచ్చే దుర్వాసన మూసివున్న తలుపులు, గోడలను దాటి బయటకు వ్యాపించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాంటిది ఇంటి నుంచి ఎలాంటి వాసన లేదా అనుమానాస్పద పరిస్థితులను ఎవరూ గుర్తించకపోవడం ఈ కేసు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

