
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం విశాఖపట్నంలో సందడి చేశారు. ఇనార్బిట్ మాల్లోని AAA మల్టీప్లెక్స్‌ను ఆయన గ్రాండ్‌గా ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్ మాల్ వరకు అడుగడుగునా అభిమానులు భారీగా తరలివచ్చి తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీపడ్డారు. అభిమానుల సందడి నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే అల్లు అర్జున్ విశాఖ పర్యటనలో ఉపయోగించిన కారుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఇదే కారులో ప్రయాణించడమే.
జూన్‌లో మంగళగిరి స్టేడియంలో జరిగిన ఏపీఎల్ మ్యాచ్‌కు రామ్‌చరణ్ ‘AP 40 LE 1’ నంబర్ గల టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లో వెళ్లారు. అదే కారులో ఆదివారం అల్లు అర్జున్ విశాఖలోని ఇనార్బిట్ మాల్లో AAA థియేటర్ల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దీంతో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే కారులో ప్రయాణించడంపై అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ కారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందినదిగా తెలుస్తోంది.
మెగా కుటుంబ సభ్యులు విశాఖకు వచ్చినప్పుడు గంటా శ్రీనివాసరావు వారికి ఆత్మీయంగా ఏర్పాట్లు చేస్తుంటారని సమాచారం. ఇద్దరు అగ్రశ్రేణి హీరోలు ఒకే కారులో ప్రయాణించడాన్ని ప్రస్తావిస్తూ వారి మధ్య ఉన్న స్నేహం, అనుబంధాన్ని గుర్తుచేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ‘ఫ్యాన్ వార్స్‌ను పక్కన పెట్టాలి’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్, అల్లు అర్జున్ ప్రయాణించిన కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

