కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి గొడవ ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొంది. భర్త రెండో భార్యపై ఓ మహిళ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన అనంతరం నిందితురాలు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇద్దరు భార్యల మధ్య మొదలైన చిన్న వివాదం క్రమంగా తీవ్ర రూపం దాల్చడంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు ఆగ్రహంతో వ్యవహరించడంతో చివరకు ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు గొడవకు కారణమేంటి? దాడి ఎలా జరిగింది? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సవతుల మధ్య జరిగిన గొడవ విషాదంగా మారింది. ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. వాంకిడి మండలం సోనాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఆత్రం కన్ని ఇద్దరు భార్యలను వివాహం చేసుకున్నాడు. ఆయన భార్యలు రాంబాయి, సాకృబాయి. ఈ నెల 5న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన మొదటి భార్య రాంబాయి.. కర్రతో రెండో భార్య సాకృబాయిపై దాడి చేసింది. ఈ దాడిలో సాకృబాయికి తీవ్ర గాయాలయ్యాయి.
కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో సాకృబాయి శుక్రవారం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన రాంబాయి గ్రామాన్ని విడిచి పొలంలోకి వెళ్లి తలదాచుకుంది. అయితే తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న ఆమె.. శనివారం మధ్యాహ్నం పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇదిలా ఉండగా.. సాకృబాయి మృతదేహం ఇంటికి చేరకముందే రాంబాయి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సోనాపూర్లో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు వరుసగా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

