
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యవహారం శ్రుతి మించుతూ ఉండటంతో ఈ ఎపిసోడ్‌లోకి టీడీపీ, జనసేన పార్టీల అధిష్టానాలు జోక్యం చేసుకున్నారు. ఇరువురు నేతలు వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఉండటంపై సీరియస్ అయ్యాయి. ఇరువురు నేతలు సంయమనం పాటించాలని.. ఏవైనా ఉంటే పార్టీ అధిష్టానాల దృష్టికి తీసుకురావాలని సమన్వయ కమిటీ సూచించింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.
టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్‌తో ఒంగోలు రాజకీయాలు వేడెక్కాయి. ఇరువురు నేతలు పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటూ ఉండటంతో.. ఈ వ్యవహారం పొలిటికల్‌గా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల అధిష్టానాలు అప్రమత్తమయ్యాయి. ఈ వ్యవహారంపై టీడీపీ, జనసేన హైకమాండ్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమికి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని ఇరువురు నేతలను అధిష్టానాలు ఆదేశించాయి. దామచర్ల, బాలినేని ఎపిసోడ్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. ఈ వ్యవహారంపై కూటమి పక్షాల సమన్వయ కమిటీ సభ్యులు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ టెలీకాన్ఫరెన్స్‌కు తెలుగుదేశం పార్టీ నుంచి.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు హాజరుకాగా.. జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు. ఏవైనా ఆరోపణలు ఉంటే అధిష్టానాలకు చెప్పాలే కానీ.. కూటమికి నష్టం కలిగేలా ప్రవర్తించవద్దని నేతలకు సమన్వయ కమిటీ సూచించింది. ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అటు జనసేన అగ్రనేతలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. సంయమనం పాటించాలని ఇరువురికీ సూచించారు. ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.
మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి , దామచర్ల జనార్ధన్ పరస్పరం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసుకోవటంతో ఈ వ్యవహారం టీడీపీ, జనసేన పార్టీలలో హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న దామచర్ల జనార్ధన్.. జనసేనలో చేరకపోయి ఉంటే తండ్రీ కొడుకులను అరెస్ట్ చేయించేవాళ్లమంటూ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలినేని అక్రమాలపై కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని.. మీరు వస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు.

