
స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పవన్ కల్యాణ్ ఓ సందేశాన్ని పోస్టు చేశారు.
దేశ స్వాతంత్ర్యం కోసం కేవలం 18 ఏళ్ల వయసులోనే ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగం చేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆయన భయంలేకుండా పోరాడిన వీరుడని కొనియాడారు. ఖుదీరామ్ బోస్ ధైర్యం దేశభక్తి నేటి యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
స్వతంత్ర భారతాన్ని చూడలేకపోయినప్పటికీ ఖుదీరామ్ బోస్ చేసిన త్యాగం దేశ స్వాతంత్ర్య పోరాటానికి బలమైన పునాదిగా నిలిచిందని పవన్ కల్యాణ్ తెలిపారు. మాతృభూమిపై ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఆయన జీవితం చాటిచెబుతోందన్నారు.
దేశ యువతలో ధైర్యం దేశభక్తి, మాతృభూమిపై అంకితభావాన్ని ఖుదీరామ్ బోస్ పేరు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘భారత్ మాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్. జై హింద్’ అంటూ ఎక్స్‌లో తన సందేశాన్ని ముగించారు.

