
కూటమిలో జరుగుతున్న తాజా పరిణామాలపై బొలిశెట్టి సత్యనారాయణ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి బాలినేని ఎపిసోడ్‌ను ప్రస్తావిస్తూ కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పోస్టుల అంశంపై ట్వీట్ చేశారు. నామినేటెడ్ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. తాను ఎలాంటి ప్రయోజనం, పదవి ఆశించి ఈ విషయాలు చెప్పడం లేదని.. కూటమి బాగు కోరి ఈ అంశాలను ప్రస్తావిస్తున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలు కూటమి పంచాయితీ హాట్ టాపిక్ అయ్యింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి , ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల అధిష్టానం రంగంలోకి దిగి ఇద్దరు నేతలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్లో బాలినేని ప్రస్తావించిన అంశాలను జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన బొలిశెట్టి సత్యనారాయణ ప్రస్తావించారు. కూటమి ధర్మమంటే హెచ్చరికులు కాదు.. కార్యకర్తలకు న్యాయం చేయడమని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను ఒక ఒక శ్రేయోభిలాషిగా, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను బయటపెట్టి, వాటిని సరిదిద్దుకోవాలని చెప్పడం తప్ప ఇప్పుడు కూటమి పార్టీలకు నేను చేయగలిగింది ఏమీ లేదన్నారు
తాను జనసేన పార్టీ నుంచి, ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తిగా ఈ మాటలు చెబుతున్నానన్నారు బొలిశెట్టి. ఇందులో తనకు ఎలాంటి పదవి, వ్యక్తిగత ప్రయోజనం, రాజకీయ ఆకాంక్ష లేదన్నారు. తాను గతంలో శ్రమించి పనిచేసిన కూటమి భవిష్యత్తు బలంగా ఉండాలన్నదే ఉద్దేశంతోనే ఈ అంశాలను చెప్పుకొచ్చారు. కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించడం సరిపోదని.. ఆ విజయం వెనుక రక్తం, చెమట చిందించిన వేలాది మంది కార్యకర్తల త్యాగాలకు తగిన గుర్తింపు, గౌరవం, న్యాయం దక్కినప్పుడే ఏ రాజకీయ కూటమి అయినా సుస్థిరంగా ఉంటుందన్నారు. నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి కోరారు. అది కేవలం లెక్కలు చెప్పడం కోసం కాకుండా.. కార్యకర్తల్లో ఏర్పడిన అనుమానాలను తొలగించి, కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించే చర్యగా ఉంటుందన్నారు.
వివాదాలు తలెత్తిన ప్రతిసారీ నాయకులకు అధిష్ఠానం హెచ్చరికలు జారీ చేయడం తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు సత్యనారాయణ. కూటమి ప్రభుత్వంలో అధికార, పదవుల పంపిణీలో న్యాయం, పారదర్శకత, సమతుల్యత ఉండటమే అసలు పరిష్కారమవుతుందన్నారు. కూటమి ధర్మం అంటే ఐక్యత పేరుతో ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాదని.. ఎన్నికల సమయంలో కూటమి కోసం పోరాడిన క్షేత్రస్థాయి కార్యకర్తకు కూడా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించడమే నిజమైన కూటమి ధర్మం అన్నారు. అలాగే ప్రస్తుత ప్రతిపక్షం బలహీనంగా ఉందన్న ధీమాతో స్వపక్ష నేతల తప్పులను, అక్రమాలను, అన్యాయాలను ఉపేక్షిస్తే ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూడటం ప్రజాస్వామ్యంలో సహజమన్నారు.

